క్రైం సిండికేట్‌లో మాజీ ఎమ్మెల్యే.. అరెస్టు
తన మేనల్లుడి నాయకత్వంలో ఉన్న క్రైం సిండికేట్‌లో సభ్యుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు రాంబీర్ షోకీన్‌ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు మోకా చట్టం కింద అరెస్టు చేశారు. ముండ్కా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అయిన షోకీన్‌ను పట్టుకుంటే లక్ష రూపాయలు ఇస్తామని పోలీసులు ఇంతకుముందు ప్రకటించారు. మరో నిందితుడితో గొడవ పడబోతుండగా అతడు తమకు చిక్కినట్లు పోలీసులు తెలిపారు. ఇంతకుముందు తన మేనల్లుడు నీరజ్ బవానా నాయకత్వంలో నడుస్తున్న క్రైం సిండికేట్‌లో కూడా భాగస్వామ్యం ఉందని షోకీన్‌పై చార్జిషీటు దాఖలైంది. తరచు నేరాలకు పాల్పడతాడని ప్రకటించిన షోకీన్‌ను ఢిల్లీ శివార్లలోని కరాలా ప్రాంతంలో గల రామా విహార్ ఏరియాలో అరెస్టుచేసినట్లు స్పెషల్ సెల్ డీసీపీ ప్రమోద్ కుమార్ కుష్వాహ చెప్పారు.
నీరజ్, షోకీన్‌లతో పాటు నీరజ్ అన్న పంకజ్ సెహ్రావత్‌పై కూడా చార్జిషీటు దాఖలైంది. వీళ్లే కాక.. సిండికేట్‌లోని ఇతర సభ్యులు సునీల్ రాఠీ, అమిత్ మాలిక్, నవీన్ దబాస్, రాహుల్ దబాస్, నవీన్ హూడా, దీపక్ దబాస్, గుర్‌ప్రీత్‌సింగ్‌లను ఇప్పటివరకు అరెస్టు చేశారు. 2013లో స్వతంత్రంగా పోటీ చేసిన షోకీన్.. ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికై ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాడు. గత సంవత్సరం ఆగస్టు 26న పోలీసులు ఇతడిని తరచు నేరాలు చేస్తాడని ప్రకటించారు.