
జోధ్‌పూర్‌లో మరో 'బ్లూవేల్' దారుణం
చెరువులోకి దూకేసిన 17 ఏళ్ల అమ్మాయి..
అదృష్టవశాత్తు పోలీసులకు సమాచారం..
సాక్షి, జోధ్‌పూర్: దేశంలో ’బ్లూవేల్’ దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో ఓ 17 ఏళ్ల అమ్మాయి చేతిపై ’బ్లూవేల్’ ఆకృతిని కత్తితో గీసుకొని.. చెరువులోకి దూకేసింది. అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో ఆ అమ్మాయి చెరువులో దూకినప్పటికీ.. అదృష్టశాత్తు అక్కడ ఉన్న స్థానికులు గుర్తించడంతో ఆమె ప్రాణాలు దక్కాయి. గజ ఈతగాళ్లు చెరువు నుంచి ఆమెను కాపాడారు. పోలీసులు ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు.
బాధిత అమ్మాయి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాను కూతురు. సోమవారం సాయంత్రం మార్కెట్‌కు వెళుతున్నానంటూ స్కూటర్ మీద బయటకు వచ్చిన ఆమె తిరిగి ఇంటికి వెళ్లలేదు. తల్లిదండ్రులు ఫోన్ చేస్తే.. రోడ్డుపై దొరికిందంటూ ఎవరో ఓ వ్యక్తి ఫోన్ ఎత్తి మాట్లాడారు. దీంతో అమ్మాయి గురించి ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆమెను వెతకడం ప్రారంభించారు. సాయంత్రం సమయంలో చెరువు సమీపంలో ఆమె స్కూటర్ మీద చక్కర్లు కొట్టినట్టు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో సమీపంలో ఉన్న కొండమీద నుంచి ఆమె చెరువులోకి దూకేసింది.
అక్కడే ఉన్న కొంతమంది గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. గజ ఈతగాళ్లతో వచ్చిన పోలీసులు అమ్మాయి ప్రాణాలు కాపాడారు. అమ్మాయి చేతిమీద బ్లూవేల్ ఆకృతి కత్తితో గీసి ఉందని, తన చివరి ట్కాస్ పూర్తి చేసేందుకు చెరువులోకి దూకానని ఆమె చెప్పినట్టు పోలీసులు తెలిపారు. ఇప్పటికే ప్రమాదకరమైన ఆన్‌లైన్ గేమ్ ’బ్లూవేల్ చాలెంజ్’ బారినపడి టీనేజ్ బాలబాలికలు ఆత్మహత్య చేసుకుంటున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆన్‌లైన్ గేమ్‌పై అప్రమత్తంగా ఉండాలని తల్లిదండ్రులకు పోలీసులు సూచిస్తున్నారు.