'దేశానికి హాని చేయాలనుకుంటోంది'
న్యూఢిల్లీ: గోమాంసం నిషేధంతో భారతదేశానికి, సమాజానికి బీజేపీ హానీ చేయాలనుకుంటుందని మాజీ ఎంపీ షాహిద్ సిద్దిఖీ ఆరోపించారు. త్వరలో బక్రీద్ రానున్న నేపథ్యంలో ఇలాగే నిషేధం కొనసాగితే విపరీత పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికే జైనుల పవిత్ర దినం సందర్భంగా మాంసంపై మహారాష్ట్రలో మాంసం నిషేధించడంపట్ల పలు విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే అటు జమ్మూకాశ్మీర్, హర్యానాతోపాటు పలు రాష్ట్రాల్లో గోమాంసం అమ్మకాల నిషేధం జరిగిన విషయం తెలిసిందే. దీనిపై పలువర్గాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా సిద్ధిఖీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
'త్వరలో బక్రీద్ వస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే సమాజంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి. మాంసంపై నిషేధం విధించి ఒకరిని సంతృప్తి పరచడానికి ఇది సరైన సమయం.. సరైనది కూడా కాదు. ఇది వరకే బీజేపీ తాము మైనారిటీలను సంతృప్తిపరిచే చర్యలకు దిగడం లేదని చెప్పింది. కానీ జైనులు కూడా మైనారిటీలే కదా. అయినా, ఎవరేం తినాలో తినకూడదో అనే అంశాన్ని తెరపైకి తెచ్చి చర్చించుకుంటూ ఒక హాస్య వాతావరణం సృష్టించాం' అని ఆయన అన్నారు.