
తుపాకులు మనకు న్యాయాన్ని ఇవ్వలేవు!
శ్రీనగర్: 'తుపాకులు మనకు న్యాయాన్ని ఇవ్వలేవు' అంటూ జమ్మూకశ్మీర్ ప్రజలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సందేశాన్ని ఇచ్చారు. 70వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సోమవారం శ్రీనగర్‌లో ఆమె మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు.
శ్రీనగర్ బక్షీ స్టేడియంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం మెహబూబా పాల్గొనగా.. ఆ వేదికకు కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో ఓ సీఆర్‌ఫీఎఫ్ అధికారి ప్రాణాలు విడువగా.. తొమ్మిది మంది గాయపడ్డారు. శ్రీనగర్‌లో జరిగిన ఈ ఉగ్రదాడి నేపథ్యంలో రాష్ట్రమంతటా హైఅలర్ట్ ప్రకటించారు. మరోవైపు వేర్పాటువాదులు ఎప్పటిలాగే 'బ్లాక్ డే'కు పిలుపునిచ్చారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం మెహబూబా మాట్లాడుతూ కశ్మీర్‌లోయలో హింసను విడనాడాలని ప్రజలను కోరారు. 'ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌లోనే మనం పరిష్కారం దొరకకుంటే.. మరెక్కడా కూడా దొరకబోదు' అని ఆమె అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న హింసకు కారణం జమ్మూకశ్మీర్ ప్రజలుకానీ, భారత ప్రభుత్వంగానీ కాదని, గతంలో రాష్ట్రాన్ని పాలించిన పాలకులే ఇందుకు కారణమని ఆమె దుయ్యబట్టారు.
హిజ్బుల్ ముజాహిద్దీన్ తీవ్రవాది బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ నాటి నుంచి రగులుతున్న కశ్మీర్ లోయ ఇంకా చల్లారని విషయం తెలిసిందే. కశ్మీర్‌లో లోయలో కొనసాగుతున్న ఆందోళనలు, హింసలో దాదాపు 50కిపైగా మంది మరణించిన సంగతి తెలిసిందే.