
హెచ్-1బీ వీసాలపై మళ్లీ టెన్షన్
వీసాల జారీలో ఆంక్షలు విధిస్తున్న ట్రంప్ ప్రభుత్వం తాజాగా ఈ ప్రక్రియను మరింత కఠినతరం చేసింది.
వీసా జారీ మరింత కఠినం
⇒ దరఖాస్తుల నిశిత తనిఖీలకు ట్రంప్ ఆదేశం
⇒ ఔట్‌సోర్సింగ్‌ను నియంత్రించేలా బిల్లు
వాషింగ్టన్: వీసాల జారీలో ఆంక్షలు విధిస్తున్న ట్రంప్ ప్రభుత్వం తాజాగా ఈ ప్రక్రియను మరింత కఠినతరం చేసింది. వీసా దరఖాస్తుల పరిశీలనను మరింత కట్టుదిట్టం చేయాలని ప్రపంచంలోని తన అన్ని దౌత్య కార్యాలయాలనూ ఆదేశించింది. పర్యాటక, బిజినెస్ సహా ఏ వీసాకైనా సరే దరఖాస్తు చేసుకొనేటప్పుడు ఇకపై కచ్చితంగా గత 15 ఏళ్ల ఉద్యోగ, నివాస వివరాలను పేర్కొనాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా ప్రస్తుత, గత ఐదేళ్లుగా ఉపయోగించిన ఫోన్ నంబర్లు, సామాజిక మాధ్యమాల అక్కౌంట్లు దరఖాస్తులో రాయాలని సహాయ మంత్రి రెక్స్ టిల్లర్సన్ ఆదేశాలు జారీ చేశారు. ఆరు ముస్లిం దేశస్తులకు అమెరికాలో ప్రవేశాన్ని నిషేధిస్తూ డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆదేశాలకు ఇది కొనసాగింపు. తాజా మార్పులతో నేర, ఉగ్ర కార్యకలాపాలకు సహకరించేవారిని నియంత్రించవచ్చు.
తక్షణమే వీసాల జారీకి సంబంధించిన కఠినమైన ప్రక్రియను రూపొందించాలని, దరఖాస్తుదారులకు మరిన్ని అదనపు ప్రశ్నలు జోడించాలని టిల్లర్సన్ పంపిన కేబుల్‌లో స్పష్టం చేశారు. ఈ నిర్ణయం భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నదాంట్లో ఇంకా స్పష్టత రాలేదు. ప్రతి దరఖాస్తునూ క్షుణ్ణంగా పరిశీలించేలా ఒక్కో వీసా జారీ అధికారి రోజుకు 120 వీసా ఇంటర్వూ్యలకు మించి చేయకూడదని తాజా నిబంధనల్లో పేర్కొన్నారు. ఇవన్నీ జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయాలన్నారు. దీనివల్ల వీసాల జారీలో జాప్యం జరుగుతుందని, దరఖాస్తుదారులపై భారం పెరుగుతుందని అమెరి కన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ డైరెక్టర్ గ్రెగ్ చాన్ చెప్పారు.
అవుట్‌సోర్సింగ్‌కు అడ్డుకట్ట!
హెచ్1బీ వీసాలను దుర్వినియోగపరుస్తూ విదేశీయులకు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలు కల్పిస్తున్న కంపెనీలకు అడ్డుకట్ట వేసేలా మరో బిల్లు తెరపైకి వచ్చింది. భారతీయ ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపే ఈ బిల్లును ‘కీపింగ్ అమెరికన్ జాబ్స్ యాక్ట్’కింద డెమోక్రటిక్ సభ్యుడు డెరెక్ కిల్మెర్, రిపబ్లికన్ సభ్యుడు డౌగ్ కొలిన్స్ ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. హెచ్1బీ ప్రోగ్రామ్ ద్వారా తాత్కాలిక వీసాలు పొందుతూ అమెరికాకు వస్తున్న విదేశీ ఉద్యోగులను నియంత్రించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. తద్వారా అమెరికన్ల ఉద్యోగాలు దేశం దాటి పోకుండా ఉంటాయని కొలిన్స్ తెలిపారు.
అమెరికాలోని ఉన్నత నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాలను భారత్ తదితర దేశాల నుంచి వచ్చే నిపుణులతో భర్తీ చేసుకొనేలా హెచ్1బీ వీసా ప్రోగ్రామ్ అవకాశం కల్పిస్తుందంటూ ఓ డాక్యుమెంటరీ జాతీయ స్థాయిలో ప్రసారం అయిన మరుసటి రోజే ఈ బిల్లు సభలో ప్రవేశపెట్టడం గమనార్హం. దేశ ఆర్థిక అభివృద్ధిలో భాగంగా అమెరికన్ల ఉద్యోగాలను కాపాడటం తమకు ఎంతో కీలకమని కొలిన్స్ చెప్పారు. ‘అర్హతగల అమెరికన్లు అందుబాటులో లేనప్పుడు హెచ్1బీ వీసా కింద విదేశీ ఉద్యోగులను తెచ్చుకొనే వీలుంది. అలాగని అమెరికన్ల ఉద్యోగాలను హరిస్తామంటే.. అలాంటి చట్టాలను మేం సమర్థించం’అన్నారు.