హెచ్‌–1బి కఠినం! | H1B visa issue: sakshi bhavitha guidance | Sakshi
Sakshi News home page

హెచ్‌–1బి కఠినం!

Published Fri, Dec 30 2016 3:21 PM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM

హెచ్‌–1బి కఠినం! - Sakshi

హెచ్‌–1బి కఠినం!

హెచ్‌–1బి వీసా.. అమెరికాలో కొలువు కలను సాకారం చేసుకునేందుకు మార్గం. దీనిద్వారా కంపెనీలకు సైతం భారత్‌ నుంచి నిపుణులను నియమించుకునే అవకాశం ఉంటుంది. అయితే అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలు అటు కంపెనీలు, ఇటు ఉద్యోగార్థులకు ఆందోళన కలిగిస్తున్నాయి. విదేశీ వలస ఉద్యోగులకు అడ్డుకట్ట వేసేలా నిబంధనలు కఠినతరం చేస్తామన్న ఆయన ప్రకటనలు అమెరికా జాబ్‌ ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో హెచ్‌–1బి నిబంధనలు– వాటిని కఠినతరం చేస్తే ప్రత్యామ్నాయ మార్గాలపై ఫోకస్‌..

హెచ్‌–1బి ద్వారా ఉద్యోగం కోసం అమెరికాలో అడుగుపెట్టడానికి రెండు విధానాలు అమలవుతున్నాయి. అవి.. 1. అమెరికాలో ఉన్న సంస్థలు విదేశీ ఉద్యోగులను నియమించడం. 2. అమెరికాలో ఉన్న కంపెనీలకు ఔట్‌సోర్సింగ్‌ ద్వారా సేవలందించే ఇతర దేశాల సంస్థలు తమ ఉద్యోగులను అమెరికాలోని తమ క్లయింట్‌ సంస్థకు పంపడం. ఈ రెండిటిలో రెండో విధానం ద్వారా అధిక శాతం మంది భారతీయులు అమెరికాలో అడుగుపెడుతున్నారు. ముఖ్యంగా మన దేశానికి చెందిన ఐటీ కంపెనీలు హెచ్‌–1బి ఆధారిత నియామకాల్లో ముందంజలో ఉంటున్నాయి.

అర్హులు లేరని రుజువు చేస్తేనే
విదేశీ వ్యక్తులను నియమించుకునే క్రమంలో సంబంధిత జాబ్‌ ప్రొఫైల్‌కు అవసరమైనlనైపుణ్యాలున్న వారు అమెరికాలో లభించడం లేదని ధ్రువీకరణ ఇస్తేనే హెచ్‌–1బి వీసా స్పాన్సర్‌షిప్‌ లెటర్‌ దరఖాస్తుకు అనుమతి లభిస్తుంది. అయితే ఈ విధానంలో తక్కువ వేతనాలకే విదేశీయులను నియమించుకుంటున్నారనే విమర్శ ఉంది. అంతేకాకుండా ఆయా జాబ్‌ ప్రొఫైల్స్‌కు అవసరమైన స్కిల్స్‌ కలిగిన యువత అమెరికాలో ఉన్నారని అక్కడ కొన్ని వర్గాలు వాదిస్తున్నాయి.

నిపుణుల కొరత
అమెరికా ఉద్యోగాలను విదేశీయులు చేజిక్కించుకోవడం వల్ల స్వదేశీ యువత అవకాశాలకు దూరమవుతోందన్నది అక్కడి రాజకీయ వర్గాల వాదన. అయితే వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయంటున్నారు నిపుణులు. అమెరికా ప్రభుత్వ కార్మిక శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం– STEM రంగాల్లో 2018 నాటికి  24 లక్షల ఉద్యోగాలకు నిపుణుల కొరత ఏర్పడనుంది. వాటిలో దాదాపు సగం ఐటీ, సాఫ్ట్‌వేర్‌ సంబంధిత ఉద్యోగాలే!

అంతేకాకుండా నవంబర్‌ 2016న యూఎస్‌ కాన్ఫరెన్స్‌ డేటా విడుదల చేసిన నివేదిక.. ప్రతి నాలుగు టెక్నికల్‌ ఉద్యోగాలకు ఒక్కరు మాత్రమే అర్హులు ఉన్నారని పేర్కొనడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో హెచ్‌–1బీ వీసా నిబంధనలు కఠినతరం చేయడమనేది ప్రస్తుతానికి అక్కడి రాజకీయ పరిస్థితుల కోణంలో యువతను ఆకర్షించే విధంగా ఉన్నప్పటికీ.. కంపెనీల కోణంలో సమీప భవిష్యత్తులో తీవ్ర ఒడిదుడుకులు ఎదురవడం ఖాయమని నిపుణులు పేర్కొంటున్నారు.

కఠిన నిబంధనలు
హెచ్‌–1బి వీసా నిబంధనలు కఠినతరం చేయడం ఖాయమని తేలిన నేపథ్యంలో వాటి తీరుతెన్నులపై నిపుణులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు..
- ఏటా 65 వేల పరిమితిగా ఉన్న హెచ్‌–1బి వీసాల సంఖ్యను 15 నుంచి 20 శాతం తగ్గించే అవకాశం.
- విదేశీ ఉద్యోగులను నియమించుకున్న కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన వీసా ఫీజు, ఇతర ఆర్థిక వ్యయాలు (ఉద్యోగులకు ఇచ్చే ఇన్సూరెన్స్, సోషల్‌ సెక్యూరిటీ ఫీజు తదితరాలు) పెంచడం.
- కనీస వేతన పరిమితిని పెంచడం. ప్రస్తుతం అమెరికాలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులకు ఇచ్చే కనీస వేతన పరిమితి కంపెనీలు, ఉద్యోగ విధుల స్థాయిని బట్టి 65 వేల డాలర్ల నుంచి 1.2 లక్షల డాలర్ల మధ్యలో ఉంది.

ప్రత్యామ్నాయ మార్గాలు
ఇప్పుడు అమెరికాలో ఉద్యోగ ఔత్సాహికులను వేధిస్తున్న ప్రశ్న.. హెచ్‌–1బి విధానం కఠినమైతే తమకున్న ప్రత్యామ్నాయాలేంటి అనేదే! ఔత్సాహికులకు రెండు ప్రత్యామ్నాయాలను నిపుణులు సూచిస్తున్నారు.

ఉన్నత విద్యాసంస్థల్లో: అమెరికాలోని ఉన్నత విద్యాసంస్థలు, రీసెర్చ్‌ సంస్థలు, లాభాపేక్ష లేని ప్రభుత్వ పరిశోధన సంస్థల్లో ఉద్యోగం పొందితే హెచ్‌–1బితో సంబంధం లేకుండా నేరుగా కొలువుదీరొచ్చు. అయితే వీటిని పొందాలంటే కనీసం పీహెచ్‌డీ అర్హత తప్పనిసరి.

ఓపీటీ: బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతతో అమెరికాలో కొలువు దీరాలనుకునే ఔత్సాహికులకు అందుబాటులో ఉన్న మరో ప్రత్యామ్నాయం ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ). ఈ మార్గంలో ఉద్యోగాన్ని సొంతం చేసుకోవాలంటే ముందుగా అభ్యర్థులు ఎఫ్‌–1 స్టూడెంట్‌ వీసాతో తొమ్మిది నెలల కంటే ఎక్కువ వ్యవధి ఉన్న కోర్సుల్లో ప్రవేశం పొందాలి. ఆ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించి, కోర్సుకు సంబంధించిన సంస్థల్లో ప్రాక్టికల్‌ శిక్షణ తీసుకునేందుకు అనుమతి పొందాలి. ఇలా అనుమతి పొందిన విద్యార్థులు STEM విభాగాల్లో గరిష్టంగా మూడేళ్లు శిక్షణ తీసుకునే అవకాశముంది. సంప్రదాయ డిగ్రీ అభ్యర్థులు ఏడాది పాటు ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ కోసం తమ కోర్సుకు సరితూగే సంస్థల్లో ప్రవేశించొచ్చు. ఇలా శిక్షణ కోసం అనుమతి పొందినవారు మెరుగైన పనితీరు ద్వారా సదరు కంపెనీలో కొలువు సొంతం చేసుకోవచ్చు. కంపెనీ ఇచ్చే స్పాన్సర్‌లెటర్‌ ద్వారా హెచ్‌–1 బి వీసా సైతం పొందొచ్చు.

భారత్‌ కంపెనీల తరఫున ప్రవేశించడం
ఇప్పటికే అమెరికాలో కార్యాలయాలు నెలకొల్పడం ద్వారా లేదా అమెరికాలోని సంస్థలకు సేవలందిస్తున్న భారత కంపెనీల తరఫున అమెరికాలో ప్రవేశించడం మరో మార్గం. అయితే ఈ విధానంలో వెళ్లాలంటే కంపెనీల్లో అంతర్గతంగా తీవ్రమైన పోటీ ఉంది. మంచి పనితీరు చూపిన వారిని స్పాన్సర్‌ చేయడానికి కంపెనీలు ప్రాధాన్యమిస్తున్నాయని హైదరాబాద్‌కు చెందిన ఐటీ నిపుణులు ఒకరు తెలిపారు.

హెచ్‌–1బి వీసా ఫ్యాక్ట్స్‌ అండ్‌ ఫిగర్స్‌

  • ఏటా 65 వేల వీసాల మంజూరు
  • 2016లో 2.36 లక్షలకుపైగా దరఖాస్తులు.
  • భారత్‌ నుంచే అత్యధిక పోటీ (దాదాపు 60 శాతం దరఖాస్తులు).


విద్యార్థుల కలలకు.. తల్లిదండ్రుల వెన్నుదన్ను
నాణ్యమైన విద్య, మెరుగైన ఉద్యోగ అవకాశాలు.. ఇవే భారతీయ విద్యార్థులను అమెరికా వైపు నడిపిస్తున్నాయి. ఉన్నతవిద్యకు అమెరికాను లక్ష్యంగా నిర్దేశించుకునేది విద్యార్థులే అయినా.. వారికి వెన్నుదన్నుగా నిలిచేది మాత్రం తల్లిదండ్రులే. వారు ఇస్తున్న నైతిక, ఆర్థిక మద్దతు కీలకమైంది. ఈ నేపథ్యంలో స్టడీ అబ్రాడ్‌–యూఎస్‌ దిశగా ఆలోచిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని, ముందడుగు వేయాలంటున్నారు నిపుణులు.. యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్టేట్‌కు చెందిన ‘ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ’.. అమెరికా విద్యపై సందేహాలను నివృత్తి చేయడానికి కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

ఇప్పటికే యూఎస్‌లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు; అమెరికా పంపించాలనుకుంటున్న పేరెంట్స్‌తో సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. వీరికి ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేస్తూ, మార్గనిర్దేశనం చేస్తోంది. అందువల్ల ఔత్సాహిక విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ నుంచి యూనివర్సిటీ సమాచారం వరకు ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవాలి.

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పరిశోధన విభాగం ఓపెన్‌ డోర్స్‌ తాజాగా విడుదల చేసిన నివేదిక (2015–16) ప్రకారం అమెరికా యూనివర్సిటీల్లో మొత్తం 10.43 లక్షల మంది విదేశీ విద్యార్థులు చేరారు. ఒక ఏడాదిలో 10 లక్షలు అంతకంటే ఎక్కువ మంది అమెరికా యూనివర్సిటీల్లో చేరడం ఇదే తొలిసారి. వీరిలో భారత్‌ నుంచి వెళ్లినవారు 1.66 లక్షల మంది. చైనా నుంచి అత్యధికంగా 3.28 లక్షల మంది వెళ్లగా, తర్వాతి స్థానంలో భారతీయ విద్యార్థులు ఉన్నారు.

మరిన్ని సూచనలు

  • పిల్లలతో మనసువిప్పి మాట్లాడాలి. వారి అభిప్రాయాలను తెలుసుకోవాలి.
  • వారి ప్రతిభను గుర్తించి, వారి ఆసక్తులను అర్థం చేసుకోవాలి.
  • యూనివర్సిటీలు, అవి ఆఫర్‌ చేస్తున్న కోర్సులపై అవగాహన పెంపొందించుకోవాలి. వాటిలో తమ పిల్లలకు నప్పే, మెచ్చే కోర్సు, విద్యాసంస్థను ఎంపిక చేయాలి.
  • ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రణాళిక ప్రకారం నడచుకోవాలి.
  • భవిష్యత్తులో ఏం నేర్చుకోబోతున్నారు? ఆ జ్ఞానం ఆధారంగా కెరీర్‌ ఎలా ఉండబోతోంది? తదితర అంశాలపై స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవాలి.
  • ఆయా యూనివర్సిటీల్లో చదువుతున్న, పూర్వ విద్యార్థులతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలి. ఎంచుకున్న కోర్సుకు సంబంధించి, కొంత పరిశోధన చేయాలి.


(స్టడీ అబ్రాడ్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement