గుట్టురట్టుచేసిన సీసీటీవీ
న్యూఢిల్లీ: దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నారన్న సామెత విన్నాం కానీ.. దొంగలు ..పోలీసులు చేతులు కలిపిన వైనంఎపుడూ కనలేదు. తాజాగా దేశరాధాని ఢిల్లీలో ఇలాంటి ఆశ్చర్యకరమైన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ చావ్రీ బజార్ మెట్రో స్టేషన్ లో మహిళా దొంగలతో చేతులు కలిపిన పోలీసాయన యవ్వారాన్ని అక్కడి సీసీటీవీ బట్టబయలు చేసింది. సీసీటీవీ రికార్డైన దృశ్యాల ప్రకారం గోల్డ్ ఆభరణం కొట్టేసిన మహిళా దొంగ నుంచి తీసుకున్న హెడ్ కానిస్టేబుల్ దాన్ని గుట్టు చప్పుడు కాకుండా తన జేబులో వేసుకుని చల్లగా జారుకున్నాడు. మరోవైపు బాధిత మహిళ భర్తతో కలిపి తీసుకున్న సెల్ఫీ ఆధారంగా ఆరుగురు సభ్యుల మహిళా దొంగల గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల సమాచారం ప్రకారం అమెరికాకు అమెరికా నుంచి వచ్చిన ఓ ఎన్నారై జంట ఈ గ్యాంగ్ బారిన పడి దోపిడీకి గురైంది. వారు మెట్రోలో గుర్గావ్ కు వెళుతుండగా వారి నగలను కొందరు మహిళా దొంగలు చాకచక్యంగా దొంగిలించారు. దీంతో తమ నగలు సహా ఇతర విలువైన వస్తువులు చోరీకి గురైనట్టు ఫిర్యాదు చేసింది. దీంతోపాటు వారు తీసుకున్న సెల్పీ పోలీసులకు చూపినప్పుడు అందులో ఈ మహిళా దొంగలు కనిపించారు. బాధితులు ఇచ్చిన వివరాల ఆధారంగా ఆరుగురు సభ్యులతో కూడిన గ్యాంగును పోలీసులు అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ నుంచి రూ.22 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు ఆ పోలీసును గుర్తించి సస్పెండ్ చేశామని పోలీసు అధికారులు తెలిపారు. పూర్తి స్థాయలో దర్యాప్తు చేపట్టామన్నారు.