స్ప్లెండర్ కొత్త బైక్ ఐస్మార్ట్ 110
న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారి హీరో మోటార్ కార్పొరేషన్, తన మొదటి ఇన్-హోస్ మోటార్ సైకిల్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. స్ప్లెండర్ ఐస్మార్ట్ 110 పేరుతో రూ.53,300లకు(ఎక్స్ షోరూం, ఢిల్లీ) ఈ బైక్ ను అందుబాటులోకి తెచ్చింది. హీరో నుంచి వచ్చిన ఈ కొత్త బైక్ ను, జైపూర్ లోని సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ(సీఐటీ)లో అభివృద్ధి చేశారు. అంతర్గతంగా అభివృద్ధి చేసిన హీరో బైక్ లో ఇదే మొదటిది. సీఐటీ నుంచి రాబోతున్న కొత్త ప్రొడక్ట్ లో కూడా ఇదే మొదటిదని హీరో మోటార్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పవన్ ముంజాల్ తెలిపారు.
పవర్ అవుట్ పుట్ ను పెంచడానికి పెద్ద 110సీసీ ఇంజిన్ ను ఈ బైక్ కు పొందుపరిచారు. హీరోస్ ఐ3ఎస్ టెక్నాలజీతో దీన్ని రూపొందించారు. డిజైన్ లో ప్రస్తుత తర స్ప్లెండర్ బైక్ లతో పెద్దగా తేడా లేనప్పటికీ, స్టయిల్ లో మాత్రం ఆకర్షణీయంగా ఉందని కంపెనీ చెబుతోంది. 4స్పీడ్ గేర్ బాక్స్, 68కి.మీ/లీటర్ మైలేజ్, 8.9బీహెచ్ పీ, 9ఎన్ఎమ్ పీక్ టార్క్, కొత్త అలాయ్ వీల్స్, ట్యూబ్ లెస్ టైర్లు ఈ బైక్ ప్రత్యేకతలు. ఈ బైక్ కున్న హెడ్ ల్యాంప్ యూనిట్ కూడా కొత్తదే. ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఆన్(ఏహెచ్ఓ) తో పాటు, కొత్త టైల్ ల్యాంప్ ను ఈ ల్యాంప్ యూనిట్ కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోతున్న మోటార్ సైకిల్ బ్రాండ్లలో స్ప్లెండర్ ఒకటిగా ఉంది. భారత్ లో, విదేశాల్లో మొత్తం 280లక్షలకు పైగా వినియోగదారులను స్ప్లెండర్ మోడల్ సొంతంచేసుకుంది.