
టెన్షనొద్దు.. 210 టన్నుల నోట్లు సిద్ధం!
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఒకటో తారీఖు టెన్షన్ దేశాన్ని ఊపేస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 1న అన్ని సంస్థలు, కంపెనీలు తమ ఉద్యోగులకు జీతాలు ఇవ్వనుండటంతో.. వీటిని బ్యాంకు నుంచి తీసుకోవడం ఎలా అనేది సమస్యగా మారింది. పెద్దనోట్ల రద్దు తర్వాత బ్యాంకుల ముందు భారీగా కనిపించిన క్యూలు ఆ తర్వాత క్రమంగా కొంత తగ్గిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఒకటో తారీఖున ఉద్యోగులకు జీతాలు, వేతనాలు బ్యాంకు ద్వారా అందుతుండటంతో వాటి పంపిణీ ఎలా అన్నది అతి పెద్ద సవాలుగా మారింది. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో మోదీ సర్కార్‌కు ఇదే అతిపెద్ద సవాలు అని భావిస్తున్న నేపథ్యంలో భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) రంగంలోకి దిగింది. ఒకటో తారీఖు టెన్షన్ అవసరం లేదని ఆర్బీఐ భరోసా ఇచ్చింది.
నిన్నటి (మంగళవారం) వరకు భారత వైమానిక దళం (ఐఏఎఫ్) విమానాల ద్వారా 210 టన్నుల కరెన్సీ నోట్లను బట్వాడా చేశామని, సీ-130, సీ-170, ఏఎన్-32 వంటి యుద్ధ విమానాలలో నోట్లను వివిధ ఆర్బీఐ కేంద్రాలకు తరలించామని ఆర్బీఐ తెలిపింది. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కూడా స్పందిస్తూ డిసెంబర్ 1న ఖాతాదారులు ఎలాంటి కష్టాలు పడకుండా చూస్తామని హామీ ఇచ్చింది. ఎస్‌బీఐ ఏటీఎంలు 90శాతం వరకు పనిచేస్తున్నాయని, ఎస్‌బీఐ ద్వారా రోజుకు రూ. 6వేల కోట్లు పంపిణీ చేస్తున్నామని ఎస్బీఐ ఎండీ రజనీష్ కుమార్ చెప్పారు. రూ. 500 నోట్లు మార్కెట్‌లోకి రాగానే పరిస్థితి మెరుగుపడుతుందని అన్నారు.