
కేంద్రం, రాష్ట్రాలు కలిస్తేనే అభివృద్ధి
సుస్థిర ప్రభుత్వం ఉంటేనే ప్రగతి
♦ హిందుస్తాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో ప్రధాని
♦ కంపెనీల కార్పొరేటీకరణ ఆలోచన ఉందని వ్యాఖ్య
♦ మొత్తానికి పార్లమెంటు సాగుతోందన్న మోదీ
న్యూఢిల్లీ: దేశాభివృద్ధికోసం తమ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను కలుపుకొని వెళుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అన్ని రాష్ట్రాలూ కేంద్రంతో కలసి వస్తేనే దేశం అభివృద్ధిపథంలో దూసుకుపోతుందని పేర్కొన్నారు. దేశాన్ని ప్రగతిబాటలో తీసుకెళ్లడం కేంద్రప్రభుత్వం ఒకరివల్లే సాధ్యపడదన్నారు. శుక్రవారం హిందుస్తాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన మోదీ.. రాష్ట్రాల అభివృద్ధికోసం తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. చతురోక్తులతో 35 నిమిషాలపాటు ప్రసంగించిన మోదీ.. ‘పార్లమెంటుకు వెళ్లాల్సిన సమయం అయింది. వర్షాకాల సమావేశాల్లో వివిధ కారణాల వల్ల సభ పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది. కానీ ఈసారి మొత్తానికి సభ జరుగుతోంది. అన్ని రాజకీయపార్టీల చొరవ కారణంగానే పార్లమెంటు సజావుగా కొనసాగుతోంది’ అన్నారు.
సుస్థిరమైన ప్రభుత్వం ఉండడంవల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయన్నారు. దేశంలో కొత్త ఆలోచనలకు కొదవ లేదని, అయితే వాటిని సమర్థంగా అమలు పరచడమే కీలకమని, తాను ఈ అంశంపైనే దృష్టిసారించానని చెప్పారు. వంద పట్టణాల్లో ఎల్‌ఈడీ లైట్ల వినియోగం, వివిధ వర్గాలకు ఇస్తున్న సిబ్సిడీలు, పబ్లిక్‌రంగ సంస్థల్లో పనివిధానంలో మార్పు తదితర అంశాలను ఆయన వివరించారు. తన పిలుపుతో దేశవ్యాప్తంగా సుమారు 40 లక్షల కుటుంబాలు ఎల్పీజీ సబ్సిడీని వదులుకున్నాయని, వీటిని తమ ప్రభుత్వం పేదవర్గాలకు ఇస్తుందని చెప్పారు. రైతులకోసం ఇస్తున్న సబ్సిడీ యూరియా పక్కదారి పడుతోందని, అయితే దానిని గుర్తించి అడ్డుకట్ట వేశామని తెలిపారు. భారత్ ఉజ్వల భవిష్యత్తువైపు వెళుతోందని మోదీ పేర్కొన్నారు.
ప్రధాని సబ్సిడీలు తొలగిస్తున్నాడని చాలామంది విమర్శిస్తుండొచ్చు.. కానీ లీకేజీలను అరికట్టి ప్రభుత్వ ధనాన్ని పొదుపుచేయకపోతే సంస్కరణలు చేపట్టడం కష్టమన్నారు. నష్టాల్లో ఉన్న సంస్థలో నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకోవటం లేదా మూసేయటం ఒకటే ఇన్నాళ్లుగా జరిగేదని.. కానీ అలాంటి సంస్థలను కార్పొరేటీకరించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చేనాటికి 85 పెద్ద ప్రాజెక్టుల పనులు ఆగిపోయాయని.. కానీ ప్రస్తుతం 60-65 ప్రాజెక్టులు మళ్లీ ప్రారంభమయ్యాయన్నారు. కాగా, ఢిల్లీలోని నేవీ హౌజ్‌లో జరిగిన నేవీ డే వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేవీలో సేవలందించిన వారికి ‘ఇన్నోవేషన్ ట్రోఫీ’లను మోదీ అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ తదితరులు పాల్గొన్నారు.
ములాయం పీఎం, డిప్యూటీగా రాహుల్: అఖిలేశ్
సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ పొత్తుపెట్టుకుంటే ములాయం సింగ్ ప్రధానిగా, రాహుల్‌గాంధీ ఉపప్రధానిగా ఉంటే బాగుంటుందని యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ అన్నారు. హిందుస్థాన్ టైమ్స్ సదస్సులో.. రాహుల్‌తో ఉన్న వ్యక్తిగత స్నేహంతో కాంగ్రెస్‌తో కలిసే అవకాశం ఉందా అని సభికులు ఆయన్ను అడిగారు. ‘నేను సమాజ్‌వాదీ (సోషలిస్టు)ని కాబట్టే నన్ను ఈ ప్రశ్న వేస్తున్నారా? నేతాజీ కలలను సాకారం చేయాలనే ఆలోచనలో ఉన్నాను. మా పొత్తుకు అంగీకారం కుదిరితే.. మా నాన్న ప్రధాని అవుతారు. ఆయన(రాహుల్ వైపు చేయి చూపిస్తూ) ఉపప్రధాని అవుతారు’ అని అన్నారు. అప్పుడు రాహుల్ ఇబ్బందికరంగా నవ్వుతూ కనిపించారు. అఖిలేశ్ వ్యాఖ్యలపై మాట్లాడేందుకు కాంగ్రెస్ నిరాకరించింది.