
'నా తర్వాత దళితుడికే సీఎం పదవి'
తన తర్వాత బీహార్ ముఖ్యమంత్రి పదవిని దళితుడికే అప్పగించాలని బీహార్ సీఎం జితన్ రామ్ మంజీ అభిప్రాయపడ్డారు.
పాట్నా: తన తర్వాత ముఖ్యమంత్రి పదవిని దళితుడికే అప్పగించాలని బీహార్ సీఎం జితన్ రామ్ మంజీ అభిప్రాయపడ్డారు. తనకు మరోసారి ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదని పేర్కొన్నారు. పశ్చిమ చంపారన్ జిల్లాలో తరూ వర్గానికి చెందిన గిరిజనులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'మరోసారి ముఖ్యమంత్రి పదవికి నన్ను ఎంపిక చేయరని తెలుసు. దీనికి నాకేం బాధ లేదు. నా తర్వాత కూడా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే దళితుడే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నా' అని మంజీ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తనను తొలగిస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయనీ విధంగా స్పందించారు. అయితే మంజీని తప్పించబోమని జేడీ(యూ) సీనియర్ నాయకుడు నితీష్ కుమార్ స్పష్టం చేశారు.