
సొంతరాష్ట్రంలో రజనీకి వ్యతిరేకత
ప్రపంచవ్యాప్తంగా కబాలి మానియా ఊపేస్తుంటే... రజనీ సొంతరాష్ట్రం కర్ణాటకలో మాత్రం ఆ చిత్రానికి వ్యతిరేకత వస్తోంది.
చెన్నై: ప్రపంచవ్యాప్తంగా కబాలి మానియా ఊపేస్తుంటే... రజనీ సొంతరాష్ట్రం కర్ణాటకలో మాత్రం ఆ చిత్రానికి వ్యతిరేకత వస్తోంది. అక్కడ కబాలి పోస్టర్లు, రజనీకాంత్ ఫోటోలను దగ్ధం చేసే కార్యక్రమం జరుగుతుండటం గమనార్హం. కర్ణాటకలో సలువరి పార్టీ కార్యకర్తలు, కన్నడ వేదిక నిర్వాహకులు రజనీపై మండిపడుతున్నారు. రజనీకాంత్ కర్ణాకటకు చెందిన వ్యక్తి అయినా తమిళ పక్షపాతి అని వారు దుయ్యబడుతున్నారు.
రజనీ కావేరి జల వివాదం వ్యవహారంలో తమిళనాడుకు మద్దతిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆగ్రహంతోనే ఆయన నటించిన కబాలి చిత్రాన్ని కర్ణాటకలోని 300 థియేటర్లకు పైగా విడుదల చేయాడాన్ని తప్పుపడుతున్నారు. ఈ కారణంగా కన్నడ చిత్రాలు బాధింపుకు గురవుతున్నాయని కన్నడ వేదిక నిర్వహకుడు పటాళ్ నాగరాజ్ పేర్కొన్నారు. ఇలా ఉండగా రెండు నెలల సుదీర్ఘ విరామం తర్వాత రజనీకాంత్ ఆదివారం అమెరికా నుంచి చెన్నై చేరుకున్నారు.