హైకోర్టుకు ‘మందిర్–మసీదు’ వివాదం
అలహాబాద్: చాలా ఏళ్ల నాటి కాశీ విశ్వనాథుడి ఆలయం–జ్ఞాన్‌వాపి మసీదు వివాదం అలహాబాద్ హైకోర్టుకు చేరింది. ఇందుకు సంబంధించిన రెండు పిటిషన్లను ప్రత్యేక బెంచ్‌కు పంపాలని కోర్టు బుధవారం తమ రిజిస్ట్రీని కోరింది. వారణాసిలోని అంజుమాన్ ఇంటాజామియా మసీదు, లక్నోలోని యూపీ సున్నీ వక్ఫ్ కేంద్ర బోర్డు రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేయడంతో న్యాయవాది జస్టిస్ సంగీత చంద్ర ఈ ఆదేశాలు జారీచేశారు.
1997, 1998లో వారణాసి అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జీ(ఏడీజే) జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ అంజూమన్ మసీదు కోర్టును ఆశ్రయించింది. కాశీ విశ్వనాథుడి ఆలయ ట్రస్టు దాఖలు చేసిన సివిల్ వ్యాజ్యాన్ని సవాలు చేస్తూ అంజూమన్ వేసిన పిటిషన్‌ను ఏడీజే కొట్టివేశారు. మసీదు వెలిసిన ఆ స్థలంలో మహారాజా విక్రమాదిత్యుడు 2 వేల ఏళ్లకు పూర్వమే ఆలయాన్ని నిర్మించారని ట్రస్ట్ 1991లో దాఖలు చేసిన తన పిటిషన్‌లో పేర్కొంది. 1664లో మొఘల్ పాలకుడు ఔరంగజేబు ఆలయాన్ని కూల్చివేసి, అక్కడ మసీదును నిర్మించారని ఆరోపించింది. మసీదును అక్కడి నుంచి తొలగించి ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరింది.
అయితే ‘మందిర్–మసీదు’ వివాదాన్ని సివిల్ కోర్టు పరిష్కచడం చట్టం ప్రకారం సాధ్యం కాదని, కాబట్టి ట్రస్ట్ పిటిషన్‌ను తిరస్కరించాలని ఇంటాజామియా మసీదు ఏడీజేని ఆశ్రయించినా నిరాశే ఎదురరైంది. ట్రస్ట్ దాఖలు చేసిన పౌర వ్యాజ్యంలో తమనూ కక్షిదారులను చేయాలన్న విజ్ఞప్తిని ఏడీజే తోసిపుచ్చడంతో సున్నీ వక్ఫ్ బోర్డు కోర్టు గడప తొక్కింది.