కేవీఆర్ కారణంగానే కేసీఆర్ రాజీనామా
* దానం యూటర్న్‌తో విజయరామారావుపై టీఆర్‌ఎస్ కన్ను
* టీడీపీకి రాజీనామా చేసిన విజయరామారావు
హైదరాబాద్: చంద్రబాబు లెక్క ప్రకారం... ఒకప్పుడు విజయరామారావు వల్లే కేసీఆర్‌కు మంత్రిపదవి దక్కలేదు. సీబీఐ మాజీ డెరైక్టర్ కె.విజయరామారావును మంత్రిమండలిలోకి తీసుకున్నానన్న కారణం చూపి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు పదవి ఇవ్వకుండా కేసీఆర్‌ను దూరం పెట్టారు. కేసీఆర్‌కు డిప్యూటీ స్పీకర్ పదవిచ్చి సరిపెట్టారు. దాంతో అసంతృప్తికి గురైన కేసీఆర్ ఏకంగా పార్టీకి డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)ని ఏర్పాటు చేశారు. ఇదంతా 2001 లో జరిగిన రాజకీయం.
తటస్థులను పార్టీలోకి ఆహ్వానిస్తూ అప్పట్లో చంద్రబాబు సీబీఐ డెరైక్టర్‌గా పనిచేసిన విజయరామారావును పార్టీలో చేర్చుకుని ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయించారు. ఆ స్థానం నుంచి గెలిచిన విజయరామారావును చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన కేసీఆర్‌ను కాదని విజయరామరావును కేబినేట్‌లోకి తీసుకుని రోడ్లు భవనాల శాఖ అప్పగించారు. ఆ పరిణామమే అప్పట్లో టీడీపీలో రాజకీయ చిచ్చుకు కారణమైంది.
కొంతకాలం వేచిచూసినప్పటికీ ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికి మంత్రిపదవులు ఇవ్వలేనన్న కారణం చూపించి కేసీఆర్‌కు డిప్యూటీ స్పీకర్‌పదవికి పరిమితం చేశారు. ఆ పరిణామమే టీఆర్‌ఎస్ ఆవిర్భవానికి కారణమైంది.
అన్ని పదవులకు రాజీనామా చేసిన 2001 ఏప్రిల్ 27 న హైదరాబాద్‌లోని జలదృశ్యంలో టీఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2004, 2009, 2014 ఇలా వరుసగా మూడుసార్లు సాధారణ ఎన్నికలు జరిగిపోయాయి. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2014 ఎన్నికల్లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అధికారం చేపట్టారు.
కాలం మారింది...
దశాబ్దన్నర... కాలం మారింది. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న విజయరామారావును ఇప్పుడు కేసీఆర్ ఆహ్వానించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఆయా పార్టీల నుంచి నాయకులను చేర్పించుకుంటున్న టీఆర్‌ఎస్ నాయకత్వం ఆ క్రమంలో రెండు మూడు రోజులుగా విజయరామారావుతో సంప్రదింపులు జరిపింది. కేసీఆర్ ఆహ్వానంగా మంత్రి హరీష్‌రావు ఆయనతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
టీడీపీకి రాజీనామా
టీఆర్‌ఎస్ నేతలతో చర్చల నేపథ్యంలో విజయరామారావు శుక్రవారం టీడీపీకి రాజీనామా చేశారు. ఈమేరకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు లేఖ పంపించారు. 1999 ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి గెలిచిన విజయరామారావు ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో ఓడిపోయారు. 2014 లో టీడీపీ ఆయనకు అవకాశమివ్వలేదు. అప్పటి నుంచి ఆయన టీడీపీ విషయంలో కొంత దూరంగా ఉంటూవస్తున్నారు.
దానం యూటర్న్‌తోనే...
జీహెచ్‌ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్‌తో టీఆర్‌ఎస్ నేతలు సంప్రదింపులు జరిపారు. దానం షరతులకు టీఆర్‌ఎస్ అంగీకరించకపోవడంతో ఆయన వెనక్కి తగ్గారు. అయిందేదో అయిందంటూ... కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ప్రకటించారు. దానం నాగేందర్ వెనక్కి తగ్గడంతో మరో నాయకుడి వేటలో పడిన టీఆర్‌ఎస్ ఒక్కసారిగా దృష్టి విజయరామారావుపై పడింది.
విజయరామారావుతో లాభమేంటి
ఒక పెద్దమనిషి తరహాలో పార్టీలో ఉండటం వల్ల నష్టమేమీ లేదని భావనతో పాటు ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌కు బలమైన నాయకుడు లేకపోవడం కూడా విజయరామారావును చేర్పించుకోవాలన్న ఆలోచనకు కారణమైందని చెబుతున్నారు.
కొసమెరుపు...
విచిత్రమేమంటే... దానం నాగేందర్ టీఆర్‌ఎస్‌లో చేరతారన్న వార్తలొచ్చినప్పుడు నష్ట నివారణ చర్యల్లో భాగంగా కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగి విజయరామారావును పార్టీలో చేర్పించుకునే ప్రయత్నాలు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వయంగా కొద్ది రోజుల కిందట విజయరామారావును కలిసి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. చివరికి జరిగిందేమంటే... దానం కాంగ్రెస్‌లోనే ఆగిపోయారు. విజయరామారావు టీఆర్‌ఎస్ వైపు మొగ్గారు.