
బీజింగ్‌లో కేసీఆర్ ‘బిజీ’నెస్!
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రతిని ధుల బృందం ఆరో రోజు చైనా పర్యటనలో వ్యాపార ప్రముఖులతో చర్చలతో బిజీబిజీగా గడిపింది.
⇒ వ్యాపార సంస్థలతో వరుస భేటీలు
⇒ రాష్ట్రంలో పెట్టుబడులకు ఆహ్వానాలు
⇒ పారిశ్రామికవాడల నిర్మాణం దిశగా చర్చలు
⇒ ఆసక్తి చూపిన ఇన్‌స్పూర్, చైనా ఫార్చ్యూన్, చాంగ్ క్వింగ్ సంస్థలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రతిని ధుల బృందం ఆరో రోజు చైనా పర్యటనలో వ్యాపార ప్రముఖులతో చర్చలతో బిజీబిజీగా గడిపింది. శనివారం బీజింగ్‌లోని ‘రాఫెల్స్ బీజింగ్’ హోటల్‌లో ఇన్‌స్పూర్ గ్రూపు, చాంగ్ క్వింగ్, చైనా ఫార్చ్యూన్ సంస్థలతోపాటు చైనా రైల్వే కార్పొరేషన్ (సీఆర్‌సీ), సానీ గ్రూపు ప్రతినిధులతో ద్వైపాక్షిక చర్చలు జరిపింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆహ్వానించింది. రాష్ట్రంలో నూతన పారిశ్రామికవాడల నిర్మాణంపై ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చలు జరిగాయి. క్లౌడ్ కంప్యూటింగ్ సేవల రంగంలో చైనాలో అగ్రగామిగా ఉన్న ఇన్‌స్పూర్ గ్రూపు రాష్ట్రంలో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఆసక్తి ప్రదర్శించింది. చాంగ్ క్వింగ్ అంతర్జాతీయ నిర్మాణ సంస్థ(సీఐసీఓ), చైనా ఫార్చ్యూన్ ల్యాండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (సీఎఫ్‌ఎల్‌డీసీ)లు సైతం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు, వ్యాపార భాగస్వామ్యం వహించేందుకు ఉత్సాహం చూపాయి.
సానుకూల స్పందన...
తొలుత చాంగ్ క్వింగ్ సంస్థ ఉపాధ్యక్షుడు, జనరల్ మేనేజర్ డు గ్జియాన్ ఝాంగ్ బృందంతో కేసీఆర్ బృందం సమావేశమైంది. ఈ సంస్థ మౌలిక సదుపాయాల రంగంలో పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) పద్ధతిలో పెట్టుబడులు పెడుతోంది. బిహార్‌లో వైద్య కళాశాల నిర్మాణం, ఢిల్లీలో లైట్ రైల్వే ప్రాజెక్టును ఈ సంస్థ చేపట్టింది. అనంతరం కేసీఆర్ బృందం అక్కడి ఇన్‌స్పూర్ గ్రూపు, ఉపాధ్యక్షుడు, ఇన్స్‌స్పూర్ ఇండియా అధ్యక్షుడు ఝాంగ్ డాంగ్ బృందంతో సమావేశమైంది. ఈ భేటీలో ఇన్‌స్పూర్ ఇండియా ఆర్థిక, ప్రభుత్వ వ్యవహారాల విభాగాల అధిపతులు టెర్రెన్స్ డు, స్నిఘ్ సుగ్‌లు సైతం పాల్గొన్నారు. అంతర్జాతీయంగా సర్వర్‌ల అమ్మకాల్లో ప్రపంచంలో ఐదో స్థానంతోపాటు చైనాలో అగ్ర స్థానంలో ఉన్న ఈ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపింది.
మరో సమావేశంలో చైనా ఫార్చ్యూన్ ల్యాండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఉపాధ్యక్షుడు లియాంగ్ వెన్టావో, ప్లానింగ్ విభాగం డెరైక్టర్ ఝాంగ్ ఖిటాన్, సహాయ ఉపాధ్యక్షుడు యాన్ జింగ్, భారతీయ కన్సల్టెంట్ సొన్ని బాడిగాతో కేసీఆర్ బృందం మంతనాలు జరిపింది. భారత్‌లో కొత్త పారిశ్రామికవాడలను అభివృద్ధి చేసే అంశంలో ఈ సంస్థ ఆసక్తి చూపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సాధ్యాసాధ్యాలపై ఈ భేటీలో ఇరువర్గాలు చర్చించుకున్నాయి. చైనాలోని పారిశ్రామిక నగరాలకు పెట్టుబడులు, అభివృద్ధి, నిర్వహణ సేవలను సీఎఫ్‌ఎల్‌డీసీ అందిస్తోంది. 12 వేల మంది ఉద్యోగులు గల ఈ సంస్థ చైనా లో గ్వాన్ డెవలప్‌మెంట్ ఏరి యా, డాచాంగ్ చావోబాయి నది అభివృద్ధి ప్రాంతం, జియాషాన్ హెచ్‌ఎస్‌ఆర్ న్యూ సిటీ, చైనా ఫార్చ్యూన్ ఇన్నోవేషన్ పార్కు తదితర ప్రాజెక్టులను అభివృద్ధి చేసిం ది. రాష్ట్రంలో సైతం ఇలాంటి నగరాల అభివృద్ధి దిశగా ప్రభుత్వం చర్చలు జరిపింది.
‘ఫర్‌బిడెన్ సిటీ’లో తెలంగాణ సీఎం
బీజింగ్‌లోని పురాతన రాచరిక నగరం ‘ఫర్‌బిడెన్ సిటీ’ని
కేసీఆర్ బృందం సందర్శించింది. మింగ్ రాజవంశం నుంచి క్వింగ్ పాలన ముగిసేవరకు రాజప్రాసాదంగా సేవలందించిన ఈ పురాతన ప్యాలెస్‌ను ప్రస్తుతం మ్యూజియంగా ఉపయోగిస్తున్నారు. దాదాపు 500 ఏళ్లకుపైగా చైనా రాజవంశీయులకు రాజప్రాసాదంగా, చైనా ప్రభుత్వానికి రాజకీయ కేంద్రంగా సేవలందించిన చరిత్ర ఈ నగరానికి ఉంది. 1406-1420 మధ్య కాలంలో నిర్మించిన ఈ నగరంలో 180 ఎకరాల విస్తీర్ణంలో 980 భవనాలున్నాయి. ఈ నగరాన్ని యునెస్కో 1987లో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. నగర విశేషాలతోపాటు సందర్శకులకు కల్పించే సౌకర్యాలను కేసీఆర్ అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు.