
'అది హింసను ప్రోత్సహించేలా ఉంది'
వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్ హింసను ప్రోత్సహించే విధంగా ఉందని రాజకీయ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.
వరంగల్: వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్ హింసను ప్రోత్సహించే విధంగా ఉందని రాజకీయ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. వరంగల్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. చట్టపరంగా చర్య తీసుకోకుండా ఎన్‌కౌంటర్ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో ఇటువంటి సంఘటనలు పునఃరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలన్నారు. అంతేకాకుండా నిరుద్యోగులకు న్యాయం జరిగే విధంగా ప్రతి పట్టభద్రునికి ఉద్యోగం వచ్చేలా నోటిఫికేషన్లు జారీ చేయాలని కోరారు.
గ్రూప్స్ రాసే అభ్యర్థులు ఆందోళన చెందకుండా సిలబస్‌పై పూర్తిగా అవగాహన పెంచుకోవాలన్నారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోవడంతోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని జేఏసీ చైర్మన్, రైతు జేఏసీ స్టీరింగ్ కమిటీ నాయకుడు ప్రొఫెసర్ కోదండరాం అభిప్రాయపడ్డారు. వరంగల్ వ్యవసాయ మార్కెట్ మిర్చియార్డు ఆవరణలో శుక్రవారం తెలంగాణ రైతు జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా సదస్సులో కూడా ఆయన మాట్లాడారు. బ్యాంకర్లకు రెవెన్యూ అధికారులు స్పష్టమైన ఆదేశాలివ్వకపోవడంతో రుణాలు మాఫీ కాక రైతాంగం అవస్థలు పడుతోందన్నారు. ఆత్మహత్యలకు పాల్పడకూడదని, ధైర్యంగా ఉండాలని కోరారు.