
దేశవ్యాప్తంగా ఎల్‌ఈడీలు
రూ.12వేల కోట్ల ఆదా లక్ష్యం: పీయూష్ గోయల్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎల్‌ఈడీ బల్బుల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా నాలుగేళ్లలో దాదాపు రూ.12 వేల కోట్లను ఆదా చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో ఎల్‌ఈడీ బల్బులను ఏర్పాటు చేయడం ద్వారా పీక్ అవర్స్‌లో ఏకంగా 10 వేల మెగావాట్ల విద్యుత్‌ను పొదుపు చేయవచ్చని భావిస్తోంది. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఫేస్‌బుక్‌లో పలు ప్రశ్నలకు జవాబుగా ఈ వివరాలు వెల్లడించారు.
2019 నాటికి ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో ఎల్‌ఈడీ బల్బులను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టనున్నామని, ఆ బల్బుల ధరలు తగ్గేలా చూస్తామని ఆయన చెప్పారు. అంతేగాకుండా తక్కువ విద్యుత్ ఉపయోగించుకునేలా తయారు చేసే స్టార్ రేటెడ్ ఉపకరణాలను వినియోగించేలా, పారిశ్రామికంగానూ విద్యుత్‌ను సమర్థవంతంగా వినియోగించేలా ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. వీటన్నింటివల్ల ఏటా 10 వేల కోట్ల యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేయవచ్చని, ఇది దేశ మొత్తం వినియోగంలో పదిశాతమని పేర్కొన్నారు.
‘రూఫ్‌టాప్’కు ప్రోత్సాహం
ఇళ్ల(రూఫ్ టాప్)పై సౌర ఫలకాల ఏర్పాటుద్వారా విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గోయల్ చెప్పారు. వచ్చే ఏడేళ్లలో దీని ద్వారా 40,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.