
మిలటరీ ప్రోటోకాల్.. నాకు బలాదూర్!
మిలటరీ ప్రోటోకాల్ కఠినమైనదే కావొచ్చు. క్రమశిక్షణతో కూడిన ఆ ప్రోటోకాల్ను ఉల్లంఘించడం కుదరకపోవచ్చు. కానీ ఈ రెండేళ్ల చిన్నారి తన తండ్రి కోసం ఎన్నో నెలలుగా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసింది. రోజూ పడుకునేముందు అమ్మా.. నాన్న ఎప్పుడు వస్తాడు అని అడిగి అడిగి ఆలసిపోయింది. ఇక ఎంతమాత్రం ఆగలేకపోయింది. ఒక రోజు కళ్లముందు కనిపించిన కన్నతండ్రిని చూసి.. ఆనందంతో ఎగిరి గంతేసింది. వెంటనే చేతులు చాచి ప్రేమగా పరిగెత్తింది. తోటి సైనికులతో పాటు అటెన్షన్గా నిలబడి ఉన్న తండ్రిని ఆలింగనం చేసుకుంది. తండ్రి కూడా ప్రోటోకాల్ను పక్కన పెట్టి, కిందకు వంగి.. ఆత్మీయంగా బిడ్డను హత్తుకుని.. తల నిమిరాడు. ఈ వీడియో ఇప్పుడు లక్షల మంది హృదయాలను హత్తుకుంటోంది.
చిన్నారి కేరిస్ ఓజెల్స్ బీ తండ్రి లెప్టినెంట్ డానియల్ ఓజెల్స్ బీ అమెరికా సైన్యంలో పనిచేస్తున్నాడు. 300 ఫోర్ట్ కార్సన్ సైనికుల్లో భాగమైన ఆయన గత తొమ్మిది నెలలు మధ్యప్రాచ్యంలో పనిచేశారు. అమెరికా సైనిక ప్రోటోకాల్ ప్రకారం విదేశాల్లో పనిచేసి వచ్చిన సైనికులకు కమాండర్ అధికారిక స్వాగతం పలకాలి. ఇందులోభాగంగా కొలరాడోలో డానియెల్ బృందానికి సైనిక లాంఛనాలతో స్వాగత కార్యక్రమం నిర్వహిస్తుండగా.. తండ్రిని చూసిన ఆనందంలో మధ్యలోనే చిన్నారి కేరిస్ పరిగెత్తుకుంటూ వెళ్లింది. అమెరికా జెండాను తలపించే దుస్తులు వేసుకున్న కేరిస్.. సైనిక ప్రోటోకాల్ కు అంతరాయం కలిగిస్తూ తండ్రిని ఆత్మీయంగా హత్తుకుంది. ఈ దృశ్యాన్ని ఫేస్బుక్లో ఇప్పటికే 40 లక్షల మందికి పైగా వీక్షించారు. 'తను ఎంతో సంతోషపడింది. నన్ను గుర్తుపట్టగానే.. వెంటనే పరిగెత్తుకువచ్చింది. వద్దు అని నేను కూడా చెప్పలేకపోయాను' అని తండ్రి డానియెల్ ఆ తర్వాత మీడియాకు చెప్పారు.