సహజీవనాన్ని గుర్తించండి!
పార్లమెంటుకు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: వివాహం చేసుకోకుండా కలిసి జీవించడం(లివ్‌ఇన్ రిలేషన్‌షిప్) నేరమో, పాపమో కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాంటి సహజీవనంలో ఉన్న మహిళలు, వారి పిల్లల రక్షణ కోసం ఒక చట్టాన్ని రూపొందించాలని గురువారం పార్లమెంటును ఆదేశించింది. సహజీవనాన్ని పార్లమెంటు గుర్తించాల్సి ఉందని పేర్కొంది. ఈ సందర్భంగా జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘దురదృష్టవశాత్తూ ఇలాంటి సంబంధాలు సంప్రదాయ వివాహాలు కాకపోవడం, చట్టం వాటిని గుర్తించకపోవడం వల్ల.. వాటిని క్రమబద్ధీకరించే స్పష్టమైన చట్టమేదీ లేదు’ అని వ్యాఖ్యానించింది.
గృహహింస చట్టంలో పేర్కొన్న ‘ వైవాహిక సంబంధం’ పరిధిలోనే ఈ సహజీవనాన్ని చేర్చే విధంగా పలుమార్గదర్శకాలను ధర్మాసనం పేర్కొంది. ఈ మార్గదర్శకాలపై పార్లమెంటు మరింత లోతుగా ఆలోచించి మరో చట్టాన్ని తీసుకురావడమో, లేక ప్రస్తుతం ఉన్న సంబంధిత చట్టాన్ని సవరించడమో చేయాలని సూచించింది. ‘మన దేశంలో సమాజం అంగీకరించనప్పటికీ సహజీవనం పాపమో, నేరమో కాదు. వివాహం చేసుకోవాలా, వద్దా లేక వివాహం చేసుకోకుండా స్త్రీ, పురుషులు సహజీవనం గడపాలా.. అనేవి సంపూర్ణంగా వారివారి వ్యక్తిగత విషయాలు’ అని పేర్కొంది. ‘ఈ సంబంధాల్లో కూడా స్త్రీ, పురుషులు విడిపోయిన తరువాత సాధారణంగా మహిళే కష్టాలు అనుభవించాల్సి వస్తోంది.
అందువల్ల వారిని, ఆ సహజీవనం వల్ల జన్మించిన పిల్లలను రక్షించే లక్ష్యంతో ఒక చట్టాన్ని రూపొందించాలి’ అని వివరించింది. అయితే, ఆ చట్టం వివాహ పూర్వ శృంగారాన్ని ప్రోత్సహించేలా ఉండకూడదని హెచ్చరించింది. అలాగే, ప్రతిపాదిత చట్టం రక్షణ కల్పించే ‘సహజీవనం’ పరిధిలో.. అక్రమ సంబంధాలు రాకూడదని సూచించింది. ఈ సహజీవనాన్ని అనేక దేశాలు గుర్తిస్తున్నాయని, మనం కూడా గుర్తించాల్సి ఉందని పేర్కొంది. పలు దేశాలు ఈ దిశగా చర్యలు తీసుకున్నాయని ధర్మాసనం ప్రస్తావించింది. సహజీవనాన్ని నిర్ధారించే క్రమంలో.. వారిరువురు ఎంతకాలంగా కలిసి ఉన్నారు?, పిల్లలు ఉన్నారా?, ఆర్థిక వ్యవహారాలను ఎలా నిర్వహించారు?, సమాజంతో సంబంధాలు.. తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని పార్లమెంటును కోరింది. తనతో సహజీవనం గడిపిన వ్యక్తి నుంచి భరణం కోరుతూ ఒక మహిళ కోర్టును ఆశ్రయించిన కేసుపై తీర్పునిస్తూ కోర్టు పై వ్యాఖ్యలు చేసింది.