
సైమాకు థ్యాంక్స్ చెప్పిన సూపర్ స్టార్
హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేష్ బాబు సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) అవార్డు-2016 అందుకోవటం సంతోషంగా ఉందని తెలిపాడు. అవార్డు అందుకున్న సందర్భంగా మహేష్ బాబు సోమవారం 'థ్యాంక్యూ సైమా' అంటూ ట్విట్ చేశాడు. శ్రీమంతుడు చిత్రానికిగానూ ప్రిన్స్ ఉత్తమ నటుడుగా సైమా అవార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సింగపూర్లో ఆదివారం ఈ వేడుక అట్టహాసంగా జరిగింది. ఆన్ లైన్ ఓటింగ్ ద్వారా అవార్డుల ఎంపిక జరగగా, ఆ పోటీలో మహేష్ బాబు దూసుకుపోయి తొలి స్థానంలో నిలిచాడు.
కాగా ఇప్పటివరకూ అయిదు సైమా అవార్డు వేడుకలు జరగ్గా, మహేష్ బాబు మూడుసార్లు సైమా అవార్డులను అందుకోవటం విశేషం. 2012లో దూకుడు, అలాగే 2014లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలకు మహేష్ ఉత్తమ నటుడుగా అవార్డులు కైవసం చేసుకున్నాడు. తాజాగా వచ్చిన అవార్డుతో అతడు ముచ్చటగా మూడోసారి కూడా ఉత్తమ నటుడుగా ఎంపిక కావటం విశేషం. కాగా మహేష్ బాబు, శృతిహాసన్ హీరో, హీరోయిన్లుగా, కొరటాల శివ దర్శకత్వంలో శ్రీమంతుడు తెరకెక్కిన విషయం తెలిసిందే. ఘన విషయం సాధించిన ఈ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్లు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
Received my "Best Actor" Trophy for Srimanthudu! Thank You @siima
— Mahesh Babu (@urstrulyMahesh) 4 July 2016