
పోస్టుమార్టంకు తీసుకెళితే లేచి కూర్చున్నాడు!
ముంబయి: ఒకసారి వ్యక్తి చనిపోయాక తిరిగి లేవడం అంటూ జరగదు. అలా జరిగితే సంతోషపడటమేమోగానీ అవాక్కయ్యి భయంలోకి కూరుకుపోవడం ఖాయం. ముంబయిలో ఇలాంటి విచిత్ర ఘటనే చోటు చేసుకుంది. చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించిన ఓ వ్యక్తికి మరికాసేపట్లో పోస్టుమార్టం నిర్వహిస్తారనగా అతడు లేచి కూర్చున్నాడు. దీంతో పోస్టుమార్టం నిర్వహించేవారు, వైద్యులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళితే.. సులోచన శెట్టి మార్గ్ లో ఉన్న సెయింట్ బస్టాప్ వద్ద ఓ వ్యక్తి(42) అపస్మారక స్థితిలోకి పడిపోయి ఉన్నాడని కొందరు వ్యక్తులు పోలీసులకు చెప్పడంతో వారు అతడిని ప్రభుత్వ సియోన్ ఆస్పత్రి(లోకమాన్య తిలక్ ఆస్పత్రి)కి తరలించారు.
ఆ వ్యక్తిని పరీక్షించిన చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రోహన్ రోహెకర్ అతడు చనిపోయినట్లు నిర్ధారించాడు. పోస్టుమార్టానికి సంబంధించిన కార్యక్రమాలు పూర్తి చేశారు. రికార్డుల్లో కూడా అతడు చనిపోయినట్లు చేర్చారు. అనంతరం పోస్టు మార్టానికి తరలించగా అందులో ఆ వ్యక్తి తిరిగి స్పృహలోకి వచ్చి లేచి కూర్చున్నాడు. దీంతో ఒక్కసారిగా అంతా అవాక్కయ్యారు. తాను చేసిన పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం ఆ వైద్యుడు చేశారు. ప్రభుత్వ వైద్యులు ఎంతటి నిర్లక్ష్యంతో ఉంటారో ఈ సంఘటనే ఉదాహరణ అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.