
గాలి జనార్దనరెడ్డి జైలు జీవితానికి రెండేళ్లు
ఇనుప ఖనిజం గనులతో కోట్లకు పడగలెత్తి, కర్ణాటక రాజకీయాలను ఒంటిచేత్తో శాసించిన గాలి జనార్దనరెడ్డి.. జైలు జీవితం ప్రారంభించి ఇప్పటికి రెండేళ్లు గడిచిపోయింది. సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం అక్రమ మైనింగ్ ఆరోపణలపై సెప్టెంబర్ ఐదో తేదీన సీబీఐ వర్గాలు బళ్లారిలోని ఆయన ఇంట్లో అరెస్టు చేశాయి. బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా కర్ణాటకలో మంత్రిగా పనిచేసిన ఆయన.. హైదరాబాద్లోని చంచల్గూడ జైల్లోనే రెండేళ్ల నుంచి ఉన్నారు. మధ్యమధ్యలో ఆయన బెంగళూరులోని పరప్పణ అగ్రహారంలో గల ప్రధాన జైలుకు కూడా వెళ్లి వస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో ఒక సాధారణ పోలీసు కానిస్టేబుల్ ముగ్గురు కొడుకుల్లో ఒకరైన గాలి జనార్ధనరెడ్డి.. ఇనుప ఖనిజం అక్రమ మైనింగ్ కేసుల్లో అటు కర్ణాటక, ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ నిందితుడిగానే ఉన్నారు. పలుమార్లు ఆయన బెయిల్ పిటిషన్లు దాఖలుచేసినా, కోర్టులు రెండు రాష్ట్రాల్లోనూ వాటిని తిరస్కరించాయి. ఆయన సోదరుల్లో ఒకరైన గాలి సోమశేఖరరెడ్డి కూడా కొన్నాళ్లపాటు జైల్లో గడిపారు. మరో సోదరుడు గాలి కరుణాకరరెడ్డి మే 5న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు.
స్వతహాగా తెలుగువారే అయినా, గాలి సోదరులు మాత్రం తమ ఇనుప ఖనిజం వ్యాపారాన్ని కర్ణాటకలోని బళ్లారిలోనే ఎక్కువగా సాగించారు. అక్కడే తమ సామ్రాజ్యాన్ని నెలకొల్పి, కన్నడ రాజకీయాలను కూడా ఒంటిచేత్తో శాసించారు. ప్రధానంగా యడ్యూరప్ప అధికారంలో ఉన్నప్పుడు గాలి సోదరుల హవా బాగా నడిచింది. 1999 లోక్సభ ఎన్నికలకు కొద్ది కాలం ముందే గాలి సోదరులు బీజేపీలో చేరారు. పార్టీ అగ్ర నాయకులలో ఒకరైన సుష్మా స్వరాజ్కు బాగా సన్నిహితంగా మెలిగేవారు. ఆమెను 'అమ్మా' అని పిలిచేవారు. అయితే, జనార్దనరెడ్డి అరెస్టు తర్వాత మాత్రం సుష్మా వారికి కొంత దూరంగా మెసులుతున్నారు.