మాయావతి పార్టీకి మరో తలనొప్పి
లక్నో: మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. రూ. 4 కోట్ల అక్రమ ఆస్తుల కేసులో బీఎస్పీ యూపీ అధ్యక్షుడు రామ్ ఆచల్ రాజ్‌భర్‌పై ఉత్తరప్రదేశ్ విజిలెన్స్ విభాగం చార్జిషీటు దాఖలు చేసింది. దీన్ని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి సమర్పించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే ఆయనపై కేసు నమోదు చేసే అవకాశముందని తెలిపాయి.
2007-2012లో తన ఆదాయం రూ. 34 లక్షలుగా అఫిడవిట్‌లో పేర్కొన్న రాజ్‌భర్ ఎన్నికల్లో రూ. 4 కోట్లు ఖర్చు చేశారు. ఈ సమయంలో యూపీలో బీఎస్పీ అధికారంలో ఉంది. ఆయనపై 2012లో రాష్ట్ర లోకాయుక్తకు ఫిర్యాదు అందడంతో దర్యాప్తు మొదలైంది. తనపై విచారణను అడ్డుకునేందుకు అంబుడ్స్మన్ ఆశ్రయించగా ఆయనకు చుక్కెదురైంది. తర్వాత వచ్చిన సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం దర్యాప్తు గురించి పట్టించుకోకపోవడంతో విచారణ ముందుకు సాగలేదు. ఇటీవల అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం విచారణ వేగవంతం చేసింది.