సోదరుడికి మరో షాకిచ్చిన ములాయం
న్యూఢిల్లీ: తన కొడుకు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను తప్పుదోవపట్టిస్తున్నాడని వరుసకు సోదరుడయ్యే రాంగోపాల్ యాదవ్‌పై ఆగ్రహంతో ఉన్న ములాయం సింగ్ యాదవ్ మరో షాకిచ్చారు. ఎంపీ రాంగోపాల్‌ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించామని, పార్టీలో సభ్యుడు కాదని ప్రకటించిన ములాయం.. ఈ విషయాన్ని తెలియజేస్తూ, ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీకి లేఖ రాశారు.
సమాజ్‌వాదీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్న రాంగోపాల్ను తొలగించి, ఆయనపై అనర్హత వేటు వేటు వేయాలని ములాయం కోరారు. ములాయం రాసిన లేఖ అన్సారీకి అందింది. త్వరలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ల కేటాయింపుల్లో విభేదాలు రావడంతో అఖిలేష్, రాంగోపాల్ ఓ వర్గంగా.. ములాయం, శివపాల్ మరో వర్గంగా విడిపోయిన సంగతి తెలిసిందే. అఖిలేష్, రాంగోపాల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించిన ములాయం తర్వాత ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. ఆదివారం ములాయం మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాంగోపాల్‌ను పార్టీ నుంచి బహిష్కరించామని, పార్టీ సభ్యుడు కారని ప్రకటించారు.