సహకార సంఘాల్లో స్పాట్ ఎక్స్ఛేంజ్‌ | NABARD asks coop banks to expand base | Sakshi
Sakshi News home page

సహకార సంఘాల్లో స్పాట్ ఎక్స్ఛేంజ్‌

Published Tue, Aug 6 2013 3:44 AM | Last Updated on Fri, Sep 1 2017 9:40 PM

NABARD asks coop banks to expand base

 ఇటిక్యాల,(మహబూబ్‌నగర్ జిల్లా) న్యూస్‌లైన్: రైతులు తమ పంట ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా గిట్టుబాటు ధర లభించిన చోట విక్రయించుకునే విధంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో(పీఏసీఎస్) స్పాట్ ఎక్స్ఛేంజ్‌ను ప్రారంభిస్తున్నట్లు నాబార్డ్ చైర్మన్ డాక్టర్ ప్రకాష్ బక్షి  తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల మండలం పుటాన్‌దొడ్డి పీఏసీఎస్‌లో స్పాట్ ఎక్స్ఛేంజ్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ ఉత్పత్తులను స్థానిక మార్కెట్లోనే అయినకాడికి అమ్ముకోవడం వల్ల సరైన రేటు రాక అప్పుల పాలవుతున్నారని పేర్కొన్నారు.
 
  దీన్ని దృష్టిలో పెట్టుకుని నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్(ఎన్‌సీడీఈఎక్స్)లో ధాన్యాన్ని విక్రయించుకునే విధంగా ఆన్‌లైన్ మార్కెటింగ్ లింకేజీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. దేశంలోనే మొదటిసారిగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో స్పాట్ ఎక్స్చేంజ్ పథకాన్ని పుటాన్‌దొడ్డి పీఏసీఎస్ ద్వారా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రైతులు తమ ఉత్పత్తులను రిజిస్ట్రేషన్ చేసిన గిడ్డంగుల్లో నిల్వ ఉంచితే రసీదులు ఇస్తారని, వీటి ఆధారంగా దేశంలో ఏ బ్యాంక్‌లోనైనా రుణం కూడా పొందవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ సీజీఎం రామ్‌చందర్‌నాయక్, రాష్ట్ర ఆప్కాబ్ చైర్మన్ కె.వీరారెడ్డి, జిల్లా కలెక్టర్ గిరిజాశంకర్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement