
భూ బిల్లుపై తొలగని ప్రతిష్టంభన
నీతి ఆయోగ్ భేటీకి డజనుకు పైగా సీఎంల గైర్హాజరు
* ముందే బహిష్కరించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు
* భేటీలో బిల్లును వ్యతిరేకించిన బీజేపీయేతర పార్టీల సీఎంలు
* బిల్లును అడ్డుకోవడం రైతుల ప్రగతిని అడ్డుకోవడమేనన్న ప్రధాని
న్యూఢిల్లీ: భూ సేకరణ బిల్లును గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు.
ఒకవైపు, ప్రభుత్వం ఈ బిల్లును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, మరోవైపు విపక్ష పార్టీలు ఐక్యంగా దీన్ని అడ్డుకోవాలని నిర్ణయించుకోవడంతో దీనిపై ప్రతిష్టంభన నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం భూ సేకరణ బిల్లుపై ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ పాలక మండలి రెండో సమావేశంలోనూ ఇదే విషయం మరోసారి స్పష్టమైంది. దాదాపు డజనుకు పైగా ముఖ్యమంత్రులు ఈ సమావేశాన్ని బహిష్కరించగా.. హాజరైన బీజేపీయేతర సీఎంలు సైతం బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు.
బీజేపీ మిత్రపక్షమైన అకాలీదళ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్(పంజాబ్) కూడా రైతుల అనుమతి లేకుండా భూ సేకరణ చేయరాదని తేల్చి చెప్పడం విశేషం. మరోవైపు, భూ బిల్లుపై ఏర్పడిన ప్రతిష్టంభన గ్రామీణాభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతోందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు.
విపక్ష సీఎంల గైర్హాజరు
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు తొమ్మిది మందితో పాటు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ(తృణమూల్ కాంగ్రెస్), తమిళనాడు సీఎం జయలలిత(ఏఐఏడీఎంకే), ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్(బీజేడీ), ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్(సమాజ్‌వాదీ పార్టీ)ఈ భేటీకి హాజరుకాలేదు. బిల్లుకు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న సవరణలను సైతం వ్యతిరేకిస్తున్నట్లు వారు స్పష్టం చేశారు.
భేటీకి హాజరైన 16 మంది ముఖ్యమంత్రుల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు నితీశ్ కుమార్(బిహార్-జేడీయూ), అరవింద్ కేజ్రీవాల్(ఢిల్లీ-ఆప్), ముఫ్తీ మొహమ్మద్ సయీద్(జమ్మూకశ్మీర్- పీడీపీ), మాణిక్ సర్కార్(త్రిపుర-సీపీఎం)లు ఉన్నారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(ఆంధ్రప్రదేశ్), తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కూడా గైర్హాజరయ్యారు.
అభివృద్ధిని అడ్డుకోవద్దు
నీతి ఆయోగ్ భేటీలో మాట్లాడుతూ.. భూ బిల్లుపై ఏర్పడిన రాజకీయ ప్రతిష్టంభన గ్రామీణాభివృద్ధిపై ముఖ్యంగా.. ఆసుపత్రులు, పాఠశాలల ఏర్పాటు, రహదారులు, జలవనరుల ప్రాజెక్టుల నిర్మాణం.. తదతరాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. పేదరిక నిర్మూలనకు రాష్ట్రాలు, కేంద్రం కలసికట్టుగా కృషి చేయాలన్నారు. రాజకీయ కారణాలతో గ్రామీణాభివృద్ధిని అడ్డుకోవద్దన్నారు. పార్లమెంటు సమావేశాలు దగ్గరపడుతున్న నేపథ్యంలో మరోసారి భూ బిల్లుపై రాష్ట్రాల సూచనలు స్వీకరించాలనుకుంటున్నామంటూ విపక్షాలకు శాంతి సందేశం పంపించారు.
ఏకాభిప్రాయంతోనే 2013 చట్టం..
2013 భూ సేకరణ చట్టం కూడా పార్టీల ఏకాభిప్రాయంతోనే ఏర్పడినందున ఇప్పటికిప్పుడు ఆ చట్టానికి సవరణలు అవసరం లేదని భేటీలో నితీశ్ కుమార్ అభిప్రాయపడగా, 2013 చట్టానికి మరికాస్త సమయం ఇవ్వాలని అరవింద్ కేజ్రీవాల్ సూచించారని జైట్లీ వెల్లడించారు. భూ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు తమిళనాడు సీఎం జయలలిత స్పష్టం చేశారు.
ఆల్రెడీ మాకో విధానముంది
ఇప్పటికే తమ రాష్ట్రంలో భూ సేకరణ విషయంలో ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తున్నామని పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ స్పష్టం చేశారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు బుర్ద్వాన్‌లో జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమంలో తేల్చిచెప్పారు. భూ బిల్లును వ్యతిరేకిస్తూ, ఇతర కార్యక్రమాల వల్ల నీతి ఆయోగ్ భేటీకి హాజరు కావట్లేదని వివరిస్తూ ప్రధానికి శనివారమే మమత ఒక లేఖ రాశారు. రాష్ట్రాల స్థానిక అవసరాల ప్రాతిపదికగా విధానాలు రూపొందించాల్సి ఉందని జమ్మూకశ్మీర్ సీఎం ఎంఎం సయీద్ సూచించారు. 2013 భూ సేకరణ చట్టం జమ్మూకశ్మీర్‌లో చెల్లదన్నారు. 2013 చట్టంలో ఎలాంటి మార్పులు అవసరం లేదని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తేల్చి చెప్పారు.
సొంత చట్టాల దిశగా రాష్ట్రాలు..
సహకార సమాఖ్య స్ఫూర్తితో ఏర్పాటు చేసిన ఈ సమావేశాన్ని బహిష్కరించడంపై ముఖ్యమంత్రులు ఆత్మావలోకనం చేసుకోవాలని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సూచించారు. భూ బిల్లులో సవరణలపై ఏకాభిప్రాయం వచ్చేవరకు ఏదురుచూడటం తమ వల్ల కాదని, బదులుగా సొంతచట్టాలను రూపొందించుకుంటామని అధికశాతం రాష్ట్రాలు అభిప్రాయపడ్డాయని భేటీ అనంతరం మీడియా సమావేశంలో జైట్లీ వెల్లడించారు. ‘ఈ బిల్లు విషయంలో కేంద్రం ఏకాభిప్రాయం సాధించలేకపోతే.. దీన్ని రాష్ట్రాలకే వదిలేయాల్సి వస్తుంది. వేగంగా అభివృద్ది చెందాలని కోరుకునే రాష్ట్రాలు సొంత చట్టాలను రూపొందించుకుంటాయి. కేంద్రం ఆయా చట్టాలకు ఆమోదం తెలుపుతుంది’ అన్నారు.