
రూ. 3 లక్షల హామీని నిలబెట్టుకోండి!
భోపాల్:కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పగ్గాలు చేపట్టి నెలలు గడుస్తున్నా.. ఎన్నికల్లో ఇచ్చిన నల్లధనంపై హామీని ఇంతవరకూ అమలు చేయకపోవడంతో విపక్షాల నుంచి భారీ స్థాయిలో విమర్శలు ఎదురవుతున్నాయి. విదేశాల్లో ఉన్న నల్లధనానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదంటూ పలువురు నాయకులు మండిపడుతున్న సంగతి తెలిసిందే. గత సాధారణ ఎన్నికల్లో మోదీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తాజాగా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కు రప్పించి ప్రతీ భారతీయుడికి రూ. మూడు లక్షల అందజేసే హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
నల్లధనం తిరిగి తేవడంతో ప్రతీ ఒక్క భారతీయ పౌరునికి కనీసం మూడు లక్షలు చొప్పన వస్తాయని ఎన్నికల్లో మోదీతో పాటు బాబా రాందేవ్ కూడా స్పష్టం చేసిన సంగతిని ఈ సందర్భంగా దిగ్విజయ్ గుర్తు చేశారు. దాంతో పాటు వారికి పన్ను మినహాయింపు వర్తింపజేసే హామీని అమలు చేసేందుకు కూడా తగిన చర్యలు చేపట్టాలన్నారు. నల్లధనం అంశాన్ని ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లడంపై మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.