
దావూద్ ఇబ్రహీంను అణచివేయండి!
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్, కరుడుగట్టిన ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం బ్రిటన్‌లో నిర్వహిస్తున్న కార్యకలాపాలను అణచివేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ యూకే ప్రధాని డేవిడ్ కామెరూన్ ను కోరే అవకాశముంది. భారత మోస్ట్ వాటెండ్ నేరగాడైన దావూద్‌ను పట్టుకొని.. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో శిక్షిస్తామని మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి చెప్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా మూడు రోజుల పర్యటన కోసం లండన్ చేరుకున్న ప్రధాని మోదీ బ్రిటన్‌తో పలు ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. అదేవిధంగా బ్రిటన్‌లో దావూద్ కార్యకలాపాలకు చెక్ పెట్టాలని ఆయన కోరే అవకాశముంది. బ్రిటన్‌లోని దావూద్ ఇబ్రహీం ఆస్తుల వివరాలతో కూడిన ఓ జాబితాను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. బ్రిటన్‌లో దావూద్‌కు కనీసం 15 ఆస్తులు ఉన్నాయని ఈ జాబితాలో ఆ వివరాలు వెల్లడించింది.