మరిన్ని నేతాజీ ఫైళ్లు బహిర్గతం
కోల్కతా: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్య ఘటనకు సంబంధించి పశ్చిమబెంగాల్ ప్రభుత్వం మరిన్ని ఫైళ్లను బహిర్గతం చేసింది. సోమవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ వివరాలను వెల్లడించారు. నేతాజీకి సంబంధించి 1937- 47 మధ్య జరిగిన బెంగాల్ రాష్ట్ర కేబినెట్ సమావేశాల్లోని అంశాలను బహిర్గతం చేశారు. నేతాజీకి సంబంధించిన ఫైళ్లను కేంద్ర ప్రభుత్వం కూడా బహిర్గతం చేయాలని మమతా బెనర్జీ కోరారు.
పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఇటీవల నేతాజీకి సంబంధించిన 64 పైళ్లను బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే. కోల్ కతాలోని పోలీసు మ్యూజియంలో వీటిని ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఫైళ్లతోపాటు కొన్ని డీవీడీలు కూడా బయటపెట్టిన ఆ రాష్ట్ర హోంశాఖ డీవీడీలను నేతాజీ కుటుంబ సభ్యులకు అందజేసింది. ఈ ఫైళ్లలో మొత్తం 12,744 పేజీలు ఉన్నాయి.
ఈ ఫైళ్ల ప్రకారం నేతాజీ 1948లో చైనాలో బతికున్నట్టు తెలుస్తోంది. చైనాలోని మంచూరియాలో ప్రాంతంలో ఉన్నట్టు వెల్లడైంది. కాగా 1945 ఆగస్టు 22న విమాన ప్రమాదంలో నేతాజీ మరణించినట్టు టోక్యో రేడియో ప్రకటించింది. అయితే ఈ వార్తను బోస్ అనుచరులు ఖండించారు. అప్పటి నుంచి నేతాజీ మరణం, అదృశ్యం మిస్టరీగా మారింది.