అల్లం ఎండుతుందో.. పండుతుందో!
ఈసారి తాను ఫాంహౌస్లో బాగా సంపాదించగలనో లేదో తనకే తెలియని పరిస్థితి ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో.. కేసీఆర్ తన ఫాంహౌస్లో బంగారం పండిస్తున్నారని, ఆయన లాగే తెలంగాణ రైతులందరూ కూడా లక్షాధికారులు, కోటీశ్వరులు కావాలంటూ పలువురు ప్రతిపక్షాల సభ్యులు చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, తాను ఫాంహౌస్లో వేసిన అల్లం పంట విషయాన్ని సీఎం కేసీఆర్.. బుధవారం నాడు తాను ఇచ్చిన సమాధానంలో ప్రస్తావించారు.
తాను ఈసారి 30-40 ఎకరాల్లో అల్లం పంట వేశానని, అయితే ఈసారి వర్షాభావ పరిస్థితులు ఉన్నందువల్ల తాను వేసిన అల్లం పండుతుందో, ఎండుతుందో తనకే తెలియదని ఆయన చెప్పారు. కేసీఆర్ మంచి టోపీ పెట్టుకుని అందంగా కనపడతారని, రాబోయే ఐదేళ్లలో తెలంగాణలో ప్రతిరైతు ఆయనలాగే సంపాదించి, టోపీలు పెట్టుకుని అందంగా కనపడాలని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ కూడా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.