ఆయిల్ షేర్లలో అమ్మకాలు
టోకు ధరల సూచి 14 నెలల గరిష్టస్థాయికి పెరగడంతో స్టాక్ సూచీలు ఐదో రోజూ తగ్గాయి. ద్రవ్యోల్బణం గరిష్టస్థాయికి చేరినందున వచ్చే రిజర్వుబ్యాంక్ పాలసీ సమీక్షలో వడ్డీ రేట్ల పెంపు తప్పకపోవచ్చన్న భయాలతో ఇన్వెస్టర్లు కొన్ని బ్లూచిప్ షేర్లను విక్రయించారు. దాంతో సోమవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 56 పాయింట్లు క్షీణించి మూడువారాల కనిష్టస్థాయి 20,659 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచి 14 పాయింట్ల తగ్గుదలతో 6,154 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ఉపసంహరణపై మంగళ, బుధవారాల్లో జరిగే అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ కమిటీ సమావేశం నిర్ణయం తీసుకోవొచ్చన్న అంచనాలు కూడా మార్కెట్ల బలహీనతకు కారణమని బ్రోకింగ్ వర్గాలు తెలిపాయి.
ఇన్ఫీ, విప్రో కౌంటర్లలో లాంగ్ బిల్డప్...
అమెరికా ఆర్థిక వ్యవస్థ క్రమేపీ కుదుటపడుతున్న ఫలితంగా ఐటీ కంపెనీలు డిసెంబర్ క్వార్టర్లో కూడా మంచి ఫలితాలు వెల్లడించవచ్చన్న అంచనాలతో ఇన్వెస్టర్లు ఇటు దృష్టిసారించడంతో ప్రధాన ఐటీ షేర్లు అత్యంత గరిష్టస్థాయిలో ముగిసాయి. సెప్టెంబర్ క్వార్టర్లో అంచనాల్ని మించిన ఫలితాలు వెల్లడించినా, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగంలో భారీ లాభాల స్వీకరణ కారణంగా అప్పట్లో ఈ షేర్లు పెరగలేకపోయాయి. ఇప్పుడు అదే విభాగంలో ఇన్ఫోసిస్, విప్రో కౌంటర్లలో లాంగ్ బిల్డప్ జరిగినట్లు డెరివేటివ్ డేటా వెల్లడిస్తున్నది.
ఇన్ఫోసిస్ ఫ్యూచర్ కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో తాజాగా 66 వేల షేర్లు (1.88 శాతం), విప్రో కాంట్రాక్టులో 2.38 లక్షల షేర్ల (2.6 శాతం) చొప్పున యాడ్ అయ్యాయి. ఇన్ఫోసిస్ రూ. 3,400 స్ట్రయిక్ వద్ద కాల్‌కవరింగ్, పుట్ రైటింగ్ జరగడంతో ఈ స్ట్రయిక్ కాల్ ఆప్షన్ నుంచి 60 వేల షేర్లు కట్‌కాగా, పుట్ ఆప్షన్లో 1.30 లక్షల షేర్ల మేర యాడ్ అయ్యాయి. అలాగే విప్రో రూ. 510 స్ట్రయిక్ వద్ద పుట్ బిల్డప్ జరగడంతో 42 వేల షేర్లు యాడ్ అయ్యాయి. ఇదే స్ట్రయిక్ కాల్ ఆప్షన్ నుంచి 23 వేల షేర్లు కట్ అయ్యాయి. ఇన్ఫోసిస్ రూ. 3,400పైన, విప్రో రూ. 510పైన స్థిరపడితే రానున్న రోజుల్లో ఇవి మరింత పెరగవచ్చని, ఆయా స్థాయిల దిగువకు క్షీణిస్తే క్రమేపీ బలహీనపడవచ్చని ఈ డేటా సూచిస్తున్నది.