పాక్, ఆఫ్ఘన్ వరదల్లో 120మంది మృతి
ఇస్లామాబాద్ : పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో ఏర్పడిన ఆకస్మిక వరదలతో మృతి చెందినవారి సంఖ్య 120కి చేరింది. అనేకమంది గల్లంతు అయ్యారు. భారీ వర్షాలకు సంభవించిన ఆకస్మిక వరదలకు ఆఫ్గనిస్తాన్‌లో 58 మంది చనిపోయారు. మరో 30 మంది వరకు గల్లంతయ్యారు. దేశ తూర్పు ప్రాంతంలోని దుర్గమప్రాంతాలైన నంగర్‌హార్, నూరిస్తాన్‌లలోని లోతట్టుప్రాంతాలు వరదలకు పూర్తిగా దెబ్బతిన్నాయి.
మట్టితో కట్టిన ఇళ్ళు పూర్తిగా కొట్టుకుపోగా, పక్కాఇళ్ళు కూలిపోయాయి. బాధితులను ఆదుకోడానికి హమీద్‌కర్జాయ్ ప్రభుత్వం రాజధాని కాబూల్ నుంచి ఆహారం మందులు, ఇతర అత్యవసర సామాగ్రిని పంపింది. తాలిబన్ తీవ్రవాద ముఠాలకు నిలయయమైన తూర్పు ఆఫ్గనిస్తాన్లోని కొండ ప్రాంత రాష్ట్రాల్లో అనూహ్య వరదలు సంభవించడం మామూలే.
మరోవైపు పాకిస్తాన్ వాణిజ్య రాజధాని కరాచీ భారీ వర్షాలకు జలదిగ్బంధనమైంది. ఆకస్మికంగా విరుచుకుపడిన వరదలకు మూడురోజుల్లో 53 మంది చనిపోయారు. వీధులన్నీ పెద్ద పెద్ద కాలువలుగా మారిపోవడంతో.. నిన్న కూడా కరాచీ వాసులు ఇళ్ళు వదిలి బైటకు రావడానికి నానా తంటాలూ పడ్డారు. డ్రైనేజీలు పొంగిపొర్లాయి.
మురుగునీటితో కలిసిన వర్షం నీరు నగరవాసులను ఇబ్బందులకు గురిచేసింది. లోపభూయిష్టంగా ఉన్న కరాచీ డ్రయినేజీ వ్యవస్థ వరద పరిస్థితిని మరింత గంభీరంగా మారుస్తోంది. మరోవైపు.. మూడురోజులుగా వర్షం పట్టిపీడిస్తుండడంతో నిత్యావసర వస్తువుల కొనుగోలు చేయడం కూడా నగర ప్రజానీకానికి గగనమైపోతోంది. రంజాన్ పండుగ సమయంలో నెలకొన్న వరద పరిస్థితి జనాన్ని ఇక్కట్లకు గురిచేస్తోంది.
కాగా పాక్, ఆఫ్ఘనిస్తాన్లు వరదలకు అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో ఇరు దేశాలకు వరద సహాయం చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ఆదేశ ఉన్నతాధికారులు వెల్లడించారు. పాక్లో వర్షాలు, వరదలకు సుమారు 80మంది మరణించారని, వేలమంది గాయపడినట్లు తమకు నివేదికలు అందాయన్నారు. అయితే సాయం కావాలని పాక్ నుంచి తమకు ఎలాంటి అభ్యర్థన రాలేదన్నారు. సాయం కోరితే ఆహారం, మందులుతో పాటు గృహాలు నిర్మాణానికి సాయం అందిస్తామని వారు పేర్కొన్నారు.