
సర్జికల్ స్ట్రైక్స్ పై పాక్ వికృత చేష్టలు!
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ దాడులు విజయవంతంగా నిర్వహించినట్టు భారత సైన్యం ప్రకటించడంతో దాయాది గుండెల్లో రాయి పడ్డట్టైంది.
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ దాడులు విజయవంతంగా నిర్వహించినట్టు భారత సైన్యం ప్రకటించడంతో దాయాది గుండెల్లో రాయి పడ్డట్టైంది. ఓవైపు సర్జికల్ దాడులు జరగలేదని గట్టిగా వాదిస్తూనే.. మరోవైపు భారత వ్యతిరేక ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది. సర్జికల్ దాడులతో తలెత్తిన ఇబ్బందికర వాతావరణాన్ని బయటకి కనపడకుండా దాచేందుకు ప్రయత్నిస్తూనే.. పాకిస్థాన్ అనేక పిల్లచేష్టలను, పిచ్చివేషాలను వేస్తున్నది. అవేమిటంటే..
పాక్ మీడియా వికృత ప్రకటనలు..
సర్జికల్ స్టయిక్స్ పై సెప్టెంబర్ 29న డీజీఎంవో లెప్టినెంట్ జనరల్ రణ్‌బీర్ సింగ్ ప్రకటన చేసిన వెంటనే పాక్ మీడియా వికృత ప్రచారాన్ని మొదలుపెట్టింది. సర్జికల్ స్టయిక్స్‌ను పాక్ తీవ్రంగా తిరస్కరించిందనే వార్తలతోపాటు ఫేక్ ఫొటోలు, మార్ఫడ్ వీడియోలతో అసత్య కథనాలు వండివార్చడం మొదలుపెట్టింది. పాక్ సైన్యం జరిపిన ప్రతీకార కాల్పుల్లో ఎనిమిదిమంది భారత సైనికులు చనిపోయినట్టు పాక్ మీడియా ఊదరగొట్టింది. కొన్ని చానెళ్లయితే ఏకంగా 14 మంది చనిపోయారని, భారత సైనిక పోస్టులను పాక్ సైన్యం చిత్తుగా ధ్వంసం చేసిందని కథనాలు అల్లుకొని సంతృప్తి చెందాయి. 'ఎక్స్‌క్లూజివ్' ట్యాగ్ తగిలించుకొని మరీ ప్రసారాలు జరిపి కొన్ని చానెళ్లు వికృత ఆనందం పొందాయి. భారత సైనికులపై పాక్ ఆర్మీ బాంబులు కురిపించినట్టు కొన్ని కల్పిత వీడియోలు సైతం ప్రసారం చేశాయి. ఈ ఫొటోలు, వీడియోలు, ఆఖరికీ కథనాలు అన్ని కల్పితమైనవి, పరమ అబద్ధాలని భారత్ ఆర్మీ తేల్చిపారేసింది.
గాలిబుడగలాట!
మీడియా ప్రసారాలు ముగిసిపోగానే పాక్ గాలిబుడగలతో వ్యతిరేక ప్రచారానికి పూనుకుంది. అక్టోబర్ 2న పంజాబ్ సరిహద్దుల్లో పాక్ నుంచి వచ్చిన మూడు డజన్లకుపైగా గాలిబుడగలను బీఎస్‌ఎఫ్ స్వాధీనం చేసుకుంది. ఈ గాలిబుడగలపై ఉర్దూలో భారత్ వ్యతిరేక సందేశాలు ఉన్నాయి. 'మోదీజీ, మా చేతిలో కత్తులు ఉన్నాయి. ఇస్లాం జిందాబాద్' అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలూ ఉన్నాయి. ఈ గాలిబుడగల పిల్లచేష్టాలను భారత సైన్యం తేలికగా తీసుకున్నా.. ఆ వెంటనే దాయాది నుంచి ఓ పావురం యుద్ధ రాయబారాన్ని మోసుకొచ్చింది.
పంజాబ్‌లోని బమియాల్ సైనిక పోస్టు వద్ద ఓ పావురాన్ని బీఎస్‌ఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పావురం ఓ విద్వేష సందేశాన్ని మోసుకొచ్చింది. 'మోదీజీ.. 1971 భారత్-పాక్ యుద్ధంనాటి ప్రజలు కాదు ఇప్పుడు ఉన్నది. భారత్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లాడు సిద్ధంగా ఉన్నాడు' అని ఉర్దూలో రాసిన కాగితాన్ని ఆ పావురానికి తగిలించి ఇటువైపు వదిలింది. ఈ పిల్లచేష్టలు, పిచ్చివేషాలతో భారత్‌ను రెచ్చగొట్టాలని దాయాది భావిస్తున్నా.. అవేమీ పెద్దగా ఫలించడం లేదు.
ఎల్‌వోసీలో విదేశీ మీడియా!
సర్జికల్ దాడులు జరగలేదని నెత్తినోరు కొట్టుకొని చెప్తున్నా పాక్ సైన్యం.. దానిని రుజువుచేసే పేరిట పాక్ వైపు వాస్తవాధీన రేఖ (ఎల్‌వోసీ) మీదుగా విదేశీ విలేకరులతో పర్యటన జరిపించింది. అయితే, తనకు అనకూలంగా ఉండే ప్రాంతాల్లోనే విదేశీ మీడియాను పాక్ తిప్పినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా పాక్ హ్యాకర్లు జమ్ము విమానాశ్రయం కమ్యూనికేషన్ ఫ్రీక్వెన్సీని హ్యాక్ చేసి.. అందులో "దిల్, దిల్ పాకిస్థాన్.. జన్ జన్‌పాకిస్థాన్' అనే దేశభక్తి పాట వచ్చేలా చేశారు. ఈ పాట విని మొదట ఎయిరిండియా పైలట్లు విస్తుపోయినా.. ఈ పిచ్చిచర్యకు వాళ్లు నవ్వుకొని.. నార్తరన్ కంట్రోల్ లో ఉన్న ఉధంపూర్ ప్రీక్వెన్సీని ఇప్పుడు వాడుకుంటున్నారు. అంతేకాకుండా పాక్ హ్యాకర్లు కూడా భారత్‌కు చెందిన చిన్న చిన్న వెబ్‌సైట్లను హ్యాక్ చేసి.. తామేదో పొడిచేసినట్టు ప్రకటించుకున్నారు. పాక్ సైన్యం చేష్టలు, ఆ దేశ మీడియా, అక్కడి నుంచి వెలువడుతున్న విద్వేష సందేశాలు ఇవన్నీ.. ఆ దేశం ఆత్మరక్షణలో ఉండి పిచ్చివేషాలు వేస్తున్నదనే విషయాన్ని చాటుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.