దేశంలోనే యంగెస్ట్ సీఎం ఆయనే! | Pema Khandu becomes youngest chief minister of country | Sakshi
Sakshi News home page

దేశంలోనే యంగెస్ట్ సీఎం ఆయనే!

Published Sun, Jul 17 2016 4:12 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM

దేశంలోనే యంగెస్ట్ సీఎం ఆయనే!

దేశంలోనే యంగెస్ట్ సీఎం ఆయనే!

ఒకప్పుడు తండ్రికి రాజకీయాల్లో అండగా నిలిచాడు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు చేదోడు-వాదోడుగా ఉండి సహకరించాడు. అలా నెమ్మదిగా అడుగులు వేస్తూ.. సామాజిక మార్పే సంకల్పంగా రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు పెమా ఖండూ.. దేశంలోనే అతి పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు సృష్టించారు. అరుణాచల్ ప్రదేశ్ 9వ సీఎంగా పెమా ఖండూ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు.

పెమాకు మద్దతుగా 45 మంది ఎమ్మెల్యేలు గవర్నర్ తథాగత్ రాయ్ ముందు పరేడ్ నిర్వహించడంతో ఇక అసెంబ్లీలో బలనిరూపణ అవసరం లేదని గవర్నర్ స్పష్టం చేశారు. అనూహ్య రాజకీయ పరిణామాల నడుమ పెమా ఖండూకు రాష్ట్రంలో అత్యున్నతమైన సీఎం పదవి లభించింది. సొంత పార్టీ కాంగ్రెస్ లో రెబల్స్ కారణంగా నబం తుకీ సీఎల్పీ పదవికి రాజీనామా చేశారు. దాంతో సీఎం పదవి నుంచి కూడా వైదొలిగారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో చీలికకు కారణమైన రెబల్ నేత, మాజీ సీఎం కలిఖో పాల్ కూడా పెమాకు మద్దతు పలుకడంతో ఆయన సీఎం పదవి చేపట్టేందుకు మార్గం సుగమమైంది.37 ఏళ్ల పెమా ఖండూతో సీఎంగా, చౌనా మెయిన్ తో డిప్యూటీ సీఎంగా  గవర్నర్ ప్రమాణం చేయించారు.


యువ సంచలనం!
37 ఏళ్లకే సీఎం పదవి చేపట్టి, దేశంలో అతి పిన్న ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించిన పెమా ఖండూ యువ సంచలనం అని చెప్పవచ్చు. పెమా ఖండూ తండ్రి డోర్జీ ఖండూ ఒకప్పుడు అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా పనిచేశారు. సీఎం పదవిలో ఉండగానే 2011లో జరిగిన విమాన ప్రమాదంలో డోర్జీ ఖండూ ప్రాణాలు విడిచారు. తండ్రి మరణం నేపథ్యంలో ఆయన పెద్ద కొడుకు అయిన పెమా ఖండూ డోర్జీ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించారు. ప్రతిష్టాత్మక ఢిల్లీ హిందూ కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఆయన తండ్రి మరణానంతరం అరుణాచల్ ప్రదేశ్ కేబినెట్ లో జలవనరుల శాఖమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

తాజాగా నబం తుకీకి వ్యతిరేకంగా అరుణాల్ ప్రదేశ్ కాంగ్రెస్ లో తిరుగుబాటు తలెత్తడం.. దీంతో తుకీ ప్రభుత్వాన్ని గవర్నర్ బర్తరఫ్ చేయడం.. రెబల్ ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడం.. సుప్రీంకోర్టు ఆదేశాలతో మళ్లీ అరుణాల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడంతో ఈ యువనేతకు దేశంలో అతిపిన్న సీఎంగా గొప్ప గౌరవం లభించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement