
జగన్ కోసం జనాందోళన
జనంలో ఉన్నా.. జైల్లో ఉన్నా.. ప్రజాశ్రేయస్సే ఊపిరిగా ఉద్యమిస్తున్న జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆ ప్రజలే అండగా నిలుస్తున్నారు. రాష్ట్ర విభజనలో సమన్యాయం కోసం జైలులోనే నిరవధిక దీక్ష చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
సాక్షి నెట్‌వర్క్: జనంలో ఉన్నా.. జైల్లో ఉన్నా.. ప్రజాశ్రేయస్సే ఊపిరిగా ఉద్యమిస్తున్న జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆ ప్రజలే అండగా నిలుస్తున్నారు. రాష్ట్ర విభజనలో సమన్యాయం కోసం జైలులోనే నిరవధిక దీక్ష చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయన నిరవధిక దీక్ష ఐదురోజులు దాటినా పట్టించుకోని ప్రభుత్వ తీరుపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం సీమాంధ్ర జిల్లాల్లో ఎక్కడికక్కడ జాతీయరహదారుల దిగ్బంధనాలు చేపట్టారు. ప్రజానేత ఆరోగ్యం బాగుండాలంటూ అన్ని మతాల వారు ప్రార్థనలు నిర్వహించారు. ఇక జననేత దీక్షకు సంఘీభావంగా సీమాంధ్ర జిల్లాల్లో 117మంది చేపట్టిన ఆమరణ దీక్షలు కొనసాగిస్తుండగా, గురువారం ఒక్కరోజే 2956మంది రిలేదీక్షలు చేపట్టారు.
అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేపట్టిన 48గంటల నిరాహార దీక్ష కొనసాగింది. కాగా, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లాలాచెరువు సెంటర్‌లో పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ర్ట కార్యదర్శి టీకే విశ్వేశ్వరరెడ్డి, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూల ఆధ్వర్యంలో వేర్వేరుగా ఎన్‌హెచ్-16ను దిగ్బంధించారు.
అగ్నిదీక్ష : కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్ద ఎన్‌హెచ్-216ను జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణు ఆధ్వర్యంలో సుమారు రెండుగంటల పాటు దిగ్బంధించారు. చుట్టూ మంటలు ఏర్పాటు చేసి మధ్యలో వేణుతో సహా సుమారు 100 మంది కార్యకర్తలు కూర్చొని గంటకుపైగా అగ్నిదీక్ష చేపట్టారు.
ప్రభుత్వ కార్యాలయాలకు తాళం: అనంతపురం జిల్లాలో గురువారం వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు ప్రభుత్వ కార్యాలయాలకు తాళం వేసి నిరసన తెలియ జేశారు. ఉరవకొండలో హంద్రీ-నీవాలో పార్టీ కార్యకర్తలు జలదీక్ష చేపట్టారు.
గుడి, దర్గాల్లో పూజలు
జగన్ ఆరోగ్యం నిలకడగా ఉండాలని కోరుతూ విశాఖనగరంలోని సంపత్ వినాయకుడి గుడి వద్ద 101 కొబ్బరికాయలు కొట్టి అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఆరోగ్యంకుదుట పడాలని కోరుతూ గాజువాక బీసీరోడ్డులో, వైఎస్సార్ జిల్లా కడప పెద్దదర్గాలో సామూహికంగా ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు.
మహిళల భారీ ర్యాలీ
వైఎస్సార్ జిల్లా కడపలో మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి సతీమణి అరుణమ్మ, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పత్తి రాజేశ్వరి ఆధ్వర్యంలో మహిళలు జియోన్ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి జగన్ దీక్షకు సంఘీభావం తెలిపారు. పులివెందులలో వైఎస్సార్ సీపీ నేత ఈసీ గంగిరెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి నేతృత్వంలో మహిళలు ర్యాలీ నిర్వహించారు. బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్ల లో ముస్లింలు రిలే దీక్షల్లో కూర్చొన్నారు.