
మన్మోహన్ సింగ్ తో మోదీ కరచాలనం(ఫైల్)
న్యూఢిల్లీ: లలిత్ గేట్, వ్యాపం కుంభకోణంపై తమ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న ప్రతిపక్ష నాయకులను రాజ్యసభలో నరేంద్ర మోదీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. చైర్మన్ హమిద్ అన్సారీ సభను వాయిదా వేయడానికి ముందు క్వశ్చర్ అవర్ లో మోదీ రాజ్యసభలోకి ప్రవేశించారు. సభ వాయిదా పడిన తర్వాత ప్రతిపక్ష నాయకులకు దగ్గరికి వెళ్లి పేరుపేరునా పలకరించారు.
మాజీ ప్రధాని మన్మోహన్ ను పలకరించి చేతులు కలిపారు. తర్వాత ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ వద్దకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చారు. వడోదర లోక్ సభ నియోజకవర్గంలో తనపై పోటీ చేసి ఓడిపోయిన మధుసూదన్ మిస్త్రీతో కరచాలనం చేశారు. రాజ్యసభలో విపక్ష ఉపనేత ఆనంద్ శర్మకు నమస్కరిస్తూ పలకరించారు. కరణ్ సింగ్, జయరామ్ రమేశ్ లతో మాట్లాడారు.
తర్వాత ట్రెజరీ బెంచీలకు వద్దకు తిరిగొచ్చి సీపీఐ నేత డి.రాజా, తమ పార్టీ ఎంపీలను పలకరించారు. ఈ సందర్భంగా పలువురు గుజరాత్ ఎంపీలు ప్రధానితో మాట్లాడేందుకు పోటీపడ్డారు. పలువురు ఆయన పాదాలను తాకి తమ విధేయత చూపారు. సుష్మ స్వరాజ్, వసుంధర రాజె, శివరాజ్ సింగ్ చౌహాన్ ల రాజీనామాకు పట్టుబడుతూ పార్లమెంట్ ఉభయ సభలను విపక్షాలు అడ్డుకుంటున్న నేపథ్యంలో మోదీ చొరవతో వాతావరణం కాస్త చల్లబడింది.