
రాజముద్ర
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నుంచి నాకు నివేదిక అందింది. ఆ నివే దికను, నాకు అందిన ఇతర సమాచారాన్ని పరిగణనలోకి తీసుకున్నాను.
రాష్ట్రపతి పాలనకు.. విభజన బిల్లుకు..
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నుంచి నాకు నివేదిక అందింది. ఆ నివే దికను, నాకు అందిన ఇతర సమాచారాన్ని పరిగణనలోకి తీసుకున్నాను. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లేని పరిస్థితి ఏర్పడిందని అర్థం చేసుకున్నాను. అందువల్ల రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 కింద నాకు సంక్రమించిన అధికారాల మేరకు రాష్ట్రంలో ప్రభుత్వ పాలనను భారత రాష్ట్రపతిగా నేను చేపడుతున్నట్లు ప్రకటిస్తున్నాను. 2014 మార్చి ఒకటో తేదీ నుంచి నా మార్గదర్శకంలో రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వ విధులను నిర్వర్తిస్తారు. రాష్ట్ర శాసన వ్యవస్థ అధికారాలను నేరుగా పార్లమెంటు ద్వారా గానీ పార్లమెంటు యంత్రాంగం ద్వారా గానీ నిర్వర్తించటం జరుగుతుందని ప్రకటిస్తున్నాను...
- రాజపత్రంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రెండు కీలకమైన నిర్ణయాలపై శనివారం చరిత్రాత్మక సంతకాలు చేశారు. ఒకటి- రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తూ అధికారికంగా ప్రకటన జారీచేశారు. అలాగే శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచుతున్నట్లు కూడా ఆదేశాలు జారీచేశారు. ఈ ప్రకటనను రాజపత్రం రూపంలో కేంద్ర హోంశాఖ భారత గెజిట్‌లో ప్రచురించింది. దీంతో రాష్ట్రంలో అధికారికంగా రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది. రెండోది- రాష్ట్రాన్ని విభజించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయటానికి ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు - 2014కు కూడా రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఫిబ్రవరి 18న లోక్‌సభ, 20న రాజ్యసభ ఆమోదించిన ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదంతో చట్టరూపం దాల్చినట్లయింది. అయితే ఈ చట్టానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను ప్రచురించటానికి మరికొంత సమయం పడుతుందని కేంద్ర హోంశాఖ వర్గాలు తెలిపాయి. అలాగే.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అవతరణ తేదీ (అపాయింటెడ్ డే) ఎప్పుడు ఉంటుందన్న సస్పెన్స్ మాత్రం ఇంకా వీడలేదు. దీనిపై కేంద్ర హోంశాఖ విడిగా ప్రకటన చేసే అవకాశముంది. మరోవైపు.. రాష్ట్రపతి పాలన గెజిట్ వెలువడటంతోనే రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రి పదవులను రద్దు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ జీవో నంబర్లు 58, 59 ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ వెబ్‌సైట్లతో పాటు కార్యాలయాల్లో సైతం.. సీఎం, మంత్రుల ఫొటోలను తొలగించి గవర్నర్ నరసింహన్ ఫొటోలు పెట్టారు. గవర్నర్ ఆదివారం ఉదయం అధికారికంగా పాలనా బాధ్యతలు చేపట్టనున్నారు.
చట్టంగా మారిన విభజన బిల్లు...
ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును సీమాంధ్ర ప్రాంత కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యులతో పాటు.. పలు జాతీయ పార్టీల తీవ్ర వ్యతిరేకత మధ్య ఫిబ్రవరి 20వ తేదీన పార్లమెంటులో ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ బిల్లు ఆ తర్వాత
న్యాయశాఖ, హోంశాఖల నుంచి రాష్ట్రపతి వద్దకు చేరగా.. ఆయన దానికి ఆమోదముద్ర వేయటంతో బిల్లు చట్టరూపంలోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం పది జిల్లాలతో హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడనుంది. సీమాంధ్రలోని 13 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొనసాగుతుంది. ఈ విభజన అమలులోకి వచ్చే తేదీ (అపాయింటెడ్ డే)ను కేంద్రం ఇంకా ప్రకటించాల్సి ఉంది. దీనిపై కేంద్ర హోంశాఖ ప్రత్యేకంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. విభజనకు పట్టే సమయాన్ని అంచనావేసి అపాయింటెడ్ డేను ప్రకటించనున్నట్లు సమాచారం. లోక్‌సభ సాధారణ ఎన్నికలతో పాటు రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు ఏప్రిల్ నెలాఖరుకు పూర్తయి మే మూడో వారంలో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కొలువు దీరేందుకు వీలుగా జూన్ 1వ తేదీని అపాయింటెడ్ డేగా ప్రకటించే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఎన్నికల షెడ్యూలు కంటే ముందుగా అపాయింటెడ్ డే ఉండే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. అలాగే.. విభజన తర్వాత మిగిలే 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని ఏర్పాటుపై అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని కూడా త్వరలో ప్రకటించనుంది. గెజిట్ నోటిఫికేషన్ తేదీ నుంచి ఆరు నెలల్లోగా ఈ కమిటీ రాజధాని ఎంపికపై అధ్యయనం చేసి నివేదిక సమర్పిస్తుంది. సీమాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక హోదా, ఇతర ప్యాకేజీలు అందిస్తామని కేంద్రం ప్రకటించినప్పటికీ.. వాటిని బిల్లులో చేర్చలేదు.
రాష్ట్ర పాలన నేను స్వీకరిస్తున్నా...
ముఖ్యమంత్రి రాజీనామా, మరో ప్రభుత్వ ఏర్పాటు చేసే పరిస్థితి లేకపోవటం నేపథ్యంలో.. భారత రాజ్యాంగంలోని 356వ అధికరణ కింద తనకు సంక్రమించిన అధికారాల మేరకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాలనను తాను స్వీకరిస్తున్నట్లు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అధికారికంగా ప్రకటించారు. మార్చి ఒకటో తేదీ నుంచి (శనివారం నుంచే) తన మార్గదర్శకంలో గవర్నర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విధులను నిర్వర్తిస్తారని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం నేపథ్యంలో.. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నానంటూ కిరణ్‌కుమార్‌రెడ్డి ఫిబ్రవరి 19వ తేదీన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
గవర్నర్ విజ్ఞప్తి మేరకు అప్పటి నుంచీ శనివారం వరకూ కిరణ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఈ మధ్య పది రోజుల పాటు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీవ్రస్థాయిలో మల్లగుల్లాలు పడింది. రెండు ప్రాంతాల సీనియర్ నేతలనూ ఢిల్లీకి పిలిపించి విడతల వారీగా చర్చలు జరిపింది. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న పలువురు నేతలు ఢిల్లీలో మకాం వేసి పైరవీలు సైతం చేశారు. అయితే.. పార్టీ రాష్ట్ర నేతల్లో.. ముఖ్యంగా సీమాంధ్ర నేతల మధ్య అనైక్యత బయటపడటంతో హైకమాండ్ పెద్దలు వెనుకంజ వేశారు. ఎవరికి సీఎం పీఠం ఇచ్చినా నేతల మధ్య లుకలుకలు బట్టబయలై పార్టీకి మరింత చేటు చేస్తుందని.. ఒక వర్గం వారికి సీఎం పదవి ఇస్తే.. మరొక వర్గం వారు పార్టీకి దూరమవుతారని ఆందోళనలో పడింది. తీవ్ర తర్జనభర్జనల అనంతరం.. ఎన్నికలు సమీపించిన తరుణంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంకన్నా రాష్ట్రపతి పాలన విధించటమే ఉత్తమమన్న నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ పాలనకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాల్సిన అవసరముందని గవర్నర్ నరసింహన్ కేంద్ర హోంశాఖకు నివేదిక ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుని.. రాష్ట్రంలో శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచి, రాష్ట్రపతి పాలన విధించాల్సిందిగా ప్రణబ్‌ముఖర్జీకి సిఫారసు చేయగా ఆయన శనివారం దీనిని ఆమోదిస్తూ అధికారిక ప్రకటన జారీచేశారు. దీంతో.. రాష్ట్రపతి ప్రతినిధిగా గవర్నర్ నరసింహన్ రాష్ట్రంలో పాలనా వ్యవహారాలను నడిపించనున్నారు.
వెబ్‌సైట్లలో గవర్నర్ ఫొటోలు ప్రత్యక్షం
రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లు, సీఎం, మంత్రుల వెబ్‌సైట్లలో ఇప్పటివరకూ ఆయా పదవుల్లో ఉన్న నాయకుల ఫొటోలను తొలగించారు. ఆ స్థానంలో గవర్నర్ నరసింహన్ ఫొటోలు ప్రత్యక్షమయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో సీఎం ఫొటో కోసం క్లిక్ చేస్తే రాష్ట్రపతి పాలన అని ఉంది. ఇక ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలోను ముఖ్యమంత్రి ఫొటోకు బదులుగా గవర్నర్ నరసింహన్ ఫొటోలు పెట్టనున్నారు.
అమాత్యుల అధికార దర్పానికి సెలవు...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి పాలన విధిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ కావటంతో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులందరినీ తొలగిస్తూ సాధారణ పరిపాలన శాఖ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. మంత్రుల అధికార వాహనాలను, సిబ్బందిని సాధారణ పరిపాలన శాఖ వెనక్కు తీసేసుకోనుంది. ఇన్ని రోజులు ఐదారుగురు సెక్యూరిటీ సిబ్బందితో పాటు బుగ్గ కార్లలో అధికార దర్పాన్ని ప్రదర్శించిన మంత్రులు ఇక సాధారణ పౌరులుగా మిగిలిపోనున్నారు. వారి అధికారిక వాహనాలను వెంటనే తొలగించనున్నారు. ప్రభుత్వ సెక్యూరిటీని కుదించనున్నారు. వ్యక్తిగతంగా ఎవరినుంచైనా ప్రాణహాని ముప్పు ఉన్న వారికి మాత్రమే పరిమితంగా ప్రభుత్వ సెక్యూరిటీని కల్పించనున్నారు. ఇప్పటికే కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం అధికార నివాసాన్ని ఖాళీ చేయగా.. తాజాగా మాజీ అయిన మంత్రు లు కూడా అధికార నివాసాలను ఖాళీ చేయాల్సి ఉంది. ఇందుకు నెల రోజుల సమయం ఇవ్వనున్నారు. సీఎం, మంత్రుల పేషీల్లోని సిబ్బంది వారి వారి సొంత శాఖలకు వెళ్లిపోనున్నారు.
ఎమ్మెల్యేలకు ఇక జీతాలు మాత్రమే...
మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా సాధారణ పౌరులుగానే ఉంటారు. శాసనసభ సుప్తచేతనావస్థలో ఉన్నందున వారికి కేవలం ఎమ్మెల్యేలుగా వేతనాలు మాత్రం ఇస్తారు. ఇన్ని రోజులూ జిల్లాలకు వెళితే ఉండే ప్రొటోకాల్ దూరం కానుంది. జిల్లా కలెక్టర్లు, ఎస్‌పీలు వచ్చే పరిస్థితి ఉండదు. దీనికి తోడు వెంటనే ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్నందన ఎమ్మెల్యేల హోదాలో కూడా ఎటువంటి అధికారాన్ని చెలాయించలేరని అధికార వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రపతి పాలనకు గెజిట్ నోటిఫికేషన్ జారీ కావటంతో సాధారణ పరిపాలన శాఖ కూడా సీఎం, మంత్రులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.