పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న పుదుచ్చేరికి రాష్ట్ర హోదా ఇవ్వాలని కోరుతూ అక్కడి అసెంబ్లీ శుక్రవారం ఓ తీర్మానాన్ని వాయిస్ ఓటు రూపంలో ఆమోదించింది. ఈ తీర్మానాన్ని సీఎం ఎన్.రంగస్వామి ప్రవేశపెట్టారు. అయితే, రాష్ట్రంగా ప్రకటించడంతో పాటు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలని కోరుతూ తీర్మానాన్ని సవరించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. దీన్ని తోసిపుచ్చడంతో కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
అంతకు ముందు ప్రతిపక్ష నేత వి.వైతిలింగం మాట్లాడుతూ రాష్ట్రంగా ప్రకటిస్తే ఎన్నో సమస్యలను, అడ్డంకులను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. అందుకే తీర్మానంలో ప్రత్యేక రాష్ట్ర హోదాను కూడా ఇవ్వాలనే డిమాండ్‌ను చేర్చాలన్నారు.