ఐపీఎల్: కొత్త స్టార్ వెలుగులోకొచ్చాడు!
కోల్ కతా: ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో మరో యువకెరటం వెలుగులోకి వచ్చింది. అద్భుతమైన పోరాటపటిమతో రూర్కీ కుర్రాడు రాహుల్ త్రిపాఠి పుణెను విజయతీరాలకు చేర్చాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. 52 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్లతో 93 పరుగులు చేసి.. తన జట్టుకు ఒంటిచేత్తో విజయాన్నందించాడు. బుధవారమిక్కడ జరిగిన మ్యాచ్ లో రాహుల్ సూపర్ షోతో కోల్ కతా నైట్ రైడర్స్ పై రైజింగ్ పుణె జెయింట్స్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
రాహుల్ త్రిపాఠి సత్తాతో ఉబ్బితబ్బిబైన పుణె కెప్టెన్ స్టీవ్ స్మిత్ అతన్ని ప్రశంసల్లో ముంచెత్తాడు. 'రాహుల్ త్రిపాఠి అంటే ఏమిటో మాకు ఈ మ్యాచ్ తెలిసేలా చేసింది. మ్యాచ్ లో రానురాను వికెట్ స్లోడౌన్ అవుతుందని మేం భావించాం. అందుకే ఆరంభ పవర్ ప్లేలోనే ఎక్కువ పరుగులు సాధించేందుకు ప్రయత్నించాం. త్రిపాఠి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. దురదృష్టవశాత్తు అతను సెంచరీ చేయలేదు. సెంచరీకి అతను ఎంతో అర్హుడు' అని స్మిత్ అన్నాడు. పుణె విజయపరంపర కొనసాగుతుండటంపై స్మిత్ హర్షం వ్యక్తం చేశాడు. గడిచిన ఏడు మ్యాచులలో ఆరింటిలో గెలుపొందడం ఆనందంగా ఉందని చెప్పాడు. మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతాను 155/8 పరుగులకు పరిమితం చేసిన పుణె బౌలర్లను కూడా ఆయన కొనియాడాడు.