రూ. 24.75 కోట్ల ఆటగాడు... ఎన్ని వికెట్లు తీస్తాడంటే?! | Steve Smith Made A Bold Prediction About The Number Of Wickets Mitchell Starc Will Take In IPL 2024 - Sakshi
Sakshi News home page

IPL 2024: రూ. 24.75 కోట్ల ఆటగాడు... ఎన్ని వికెట్లు తీస్తాడంటే?!

Published Fri, Mar 22 2024 4:31 PM | Last Updated on Fri, Mar 22 2024 4:44 PM

IPL 2024 How many wickets for Starc Steve Smith Bold Prediction - Sakshi

మిచెల్‌ స్టార్క్‌ (PC: PTI)

ఐపీఎల్‌-2024 సందడి మొదలైపోయింది. పొట్టి ఫార్మాట్‌లోని మజాను అందించేందుకు ఆటగాళ్లు.. ఆస్వాదించేందుకు అభిమానులూ సిద్ధమైపోయారు. చెపాక్‌ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో శుక్రవారం (మార్చి 22) ఈవెంట్‌కు తెరలేవనుంది.

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌, ఐపీఎల్‌ కామెంటేటర్‌ స్టీవ్‌ స్మిత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సహచర ఆటగాడు మిచెల్‌ స్టార్క్‌ ఐపీఎల్‌-2024లో కచ్చితంగా సత్తా చాటుతాడంటూ.. తాజా ఎడిషన్‌లో ఎన్ని వికెట్లు తీయగలడో అంచనా వేశాడు. 

కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023లో అదరగొట్టిన మిచెల్‌ స్టార్క్‌ దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో పునరాగమనం చేయనున్నాడు. వేలంలో భాగంగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అతడి కోసం పోటీ పడి ఏకంగా రూ. 24.75 కోట్లు ఖర్చు చేసింది. 

ఫలితంగా ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా ఈ పేస్‌ బౌలర్‌ నిలిచాడు. దీంతో మిచెల్‌ స్టార్క్‌పై అంచనాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈఎస్‌ఎపీఎన్‌క్రిక్‌ఇన్ఫో షోలో మాట్లాడిన ఆసీస్‌ మాజీ సారథి స్టీవ్‌ స్మిత్‌కు స్టార్క్‌ గురించి ప్రశ్న ఎదురైంది.

ఇందుకు బదులిస్తూ.. ‘‘నాకు తెలిసి అతడు కొత్త బంతితో కచ్చితంగా మ్యాజిక్‌ చేయగలడు. ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో అతడే బౌలింగ్‌ చేస్తాడు కాబట్టి వికెట్లు తీసే అవకాశం ఉంటుంది.

ఈసారి స్టార్క్‌ 30 వికెట్లు తీస్తాడని అనుకుంటున్నా’’ అని స్మిత్‌ అంచనా వేశాడు. కాగా ఐపీఎల్‌లో ఒక ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా డ్వేన్‌ బ్రావో, హర్షల్‌ పటేల్‌ సంయుక్త రికార్డు సాధించారు.

2013లో సీఎస్‌కే తరఫున బ్రావో.. 2021లో ఆర్సీబీ తరఫున హర్షల్‌ పటేల్‌ 32 వికెట్లు తీశారు. 2020లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన సౌతాఫ్రికా స్టార్‌ కగిసో రబడ 30 వికెట్లతొ రెండోస్థానాన్ని ఆక్రమించాడు. ఇదిలా ఉంటే కేకేఆర్‌ తాజా సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మార్చి 23న తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement