అసలు ఆ ఓవర్లో అన్ని పరుగులిస్తావా?.. స్టార్క్‌పై ఆగ్రహం​ | KKR Fans Blasts Starc Better Bowling Attack Would Have Defended It Vs RR | Sakshi
Sakshi News home page

IPL 2024: అసలు ఆ ఓవర్లో అన్ని పరుగులిస్తావా?.. స్టార్క్‌పై ఆగ్రహం

Published Wed, Apr 17 2024 10:43 AM | Last Updated on Wed, Apr 17 2024 11:25 AM

KKR Fans Blasts Starc Better Bowling Attack Would Have Defended it Vs RR - Sakshi

#Starc: కోల్‌కతా నైట్‌ రైడర్స్ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. ‍కోట్లు పెట్టి కొన్నందుకు అతడి వల్ల జట్టుకు ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయిందని సొంత జట్టు అభిమానులే ఫైర్‌ అవుతున్నారు. 

కాగా ఐపీఎల్‌-2024 వేలంలో భాగంగా కేకేఆర్‌ మిచెల్‌ స్టార్క్‌ కోసం మిగతా ఫ్రాంఛైజీలతో పోటీ పడి మరీ అతడిని సొంతం చేసుకుంది. ఇందుకోసం ఏకంగా రికార్డు స్థాయిలో రూ. 24.75 కోట్లు ఖర్చు పెట్టింది. ఫలితంగా క్యాష్‌ రిచ్‌ లీగ్‌ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా ఈ ఆసీస్‌ స్టార్‌ రికార్డులకెక్కాడు.

కానీ అందుకు తగ్గ ప్రదర్శన మాత్రం చేయలేకపోతున్నాడు. పదిహేడో ఎడిషన్‌లో తొలి రెండు మ్యాచ్‌లో వికెట్లు తీయలేకపోయిన స్టార్క్‌.. ఆ తర్వాత  గాడిలో పడ్డట్లే కనిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై రెండు.. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు.

అసలు ఆ ఓవర్లో అన్ని పరుగులిస్తావా?
అయితే.. రాజస్తాన్‌ రాయల్స్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో మరోసారి విఫలమయ్యాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్‌ కోటా పూర్తి చేసిన స్టార్క్‌ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఏకంగా 50 పరుగులు లీక్‌ చేశాడు. ముఖ్యంగా కీలకమైన పద్దెనిమిదవ ఓవర్లో 18 పరుగులు ఇవ్వడం తీవ్ర ప్రభావం చూపింది.

ఇక కేకేఆర్‌ మిగిలిన బౌలర్లలో స్పిన్నర్లు సునిల్‌ నరైన్‌ (2/30), వరుణ్‌ చక్రవర్తి (2/36) మెరుగ్గా ఆడగా.. స్టార్క్‌తో పాటు పేస్‌ విభాగంలో వైభవ్‌ అరోరా(1/45), హర్షిత్‌ రాణా (2/45) భారీగా పరుగులు ఇచ్చారు.

అయితే, వీరిద్దరు వికెట్లు కూడా తీశారు. కానీ ఎంతో అనుభవం ఉన్న స్టార్క్‌ ఒక్క వికెట్‌ కూడా తీయలేక చతికిలపడ్డాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఆఖరి బంతికి సింగిల్‌ తీసిన సెంచరీ వీరుడు జోస్‌ బట్లర్‌ రాజస్తాన్‌ను గెలిపించిన విషయం తెలిసిందే.

పైసా వసూల్‌ మాత్రమే.. ప్రదర్శన లేదు
ఫలితంగా వరుస విజయాలతో జోరు మీదున్న కేకేఆర్‌కు ఓటమి ఎదురైంది. ఈ క్రమంలో స్టార్క్‌ విమర్శకుల టార్గెట్‌గా మారాడు. స్టార్క్‌ కాస్త పొదుపుగా బౌలింగ్‌ చేసి ఉంటే కేకేఆర్‌కు భంగపాటు తప్పేదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక నెట్టింట అయితే.. అతడిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ జరుగుతోంది. ‘‘రూ. 24.75 కోట్లు ఖర్చు పెట్టి కొంటే పైసా వసూల్‌ మాత్రమే.. ప్రదర్శన లేదు’’ అంటూ స్టార్క్‌పై సెటైర్లు వేస్తున్నారు. అయితే, అతడి ఫ్యాన్స్‌ మాత్రం అండగా నిలుస్తూ.. కీలక సమయంలో రాణించి తన విలువేంటో చాటుకుంటాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

కేకేఆర్‌ వర్సెస్‌ రాజస్తాన్‌ స్కోర్లు:
►వేదిక: ఈడెన్‌ గార్డెన్స్‌, కోల్‌కతా
►టాస్‌: రాజస్తాన్‌.. బౌలింగ్‌
►కేకేఆర్‌ స్కోరు: 223/6 (20)
►రాజస్తాన్‌ స్కోరు: 224/8 (20)
►ఫలితం: రెండు వికెట్ల తేడాతో కేకేఆర్‌పై రాజస్తాన్‌ విజయం

చదవండి: ఐపీఎల్‌ చరిత్రలో తొలి జట్టుగా రాజస్తాన్‌ ఆల్‌టైమ్‌ రికార్డు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement