- ఆఖరినిమిషంలో అపాయింట్‌మెంట్ రద్దుచేసిన కేంద్ర హోం మంత్రి..
- మియాపూర్ భూకుంభకోణం ఫిర్యాదు స్వీకరణకు నిరాకరణ
- కాంగ్రెస్ మండిపాటు.. టీఆర్‌ఎస్‌ను బీజేపీ కాపాడుతోందని విమర్శ
సాక్షి, న్యూఢిల్లీ: మియాపూర్ భూ కుంభకోణంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలనుకున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలకు చేదు అనుభవం ఎదురైంది. ఈ వ్యవహారంపై ఫిర్యాదు స్వీకరించేందుకు సమయం ఇచ్చిన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. తీరా చివరి నిమిషంలో అపాయింట్‌మెంట్ రద్దుచేశారు. దీంతో కేంద్ర మంత్రిపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూకుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాల్సిందేనని, ఈ విషయంలో నిజానిజాలు తేలేంతవరకు తాము పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
కేంద్రమే నేరుగా ఎంక్వైరీకి ఆదేశించాలి
టీఆర్‌ఎస్-బీజేపీల మధ్య చీకటి ఒప్పందం జరిగిందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ‘రాష్ట్రపతి ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తానన్నందుకే ప్రతిఫలంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కేంద్రం కాపాడుతున్నద’ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. భూకుంభకోణంతో సంబంధమున్న టీఆర్‌ఎస్ నేతలకు బీజేపీ కాపాడుతోందని విమర్శించారు. కబ్జాకు గురైన వాటిలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన భూములు కూడా ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సుతో సంబంధం లేకుండా కేంద్రమే నేరుగా సీబీఐ విచారణకు ఆదేశించవచ్చునని దిగ్విజయ్ సింగ్ చెప్పారు.
అపాయింట్‌మెంట్ లేదనటం అప్రజాస్వామికం:జానారెడ్డి
మియాపూర్ భూ కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాల్పిందేనని సీఎల్పీ నేత జానా రెడ్డి డిమాండ్ చేశారు. మియాపూర్ భూకుంభకోణంపై సీబీఐ విచారణ కోరడానికి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అపాయింట్‌మెంట్ కోరామని, అయితే బుధవారం అపాయింట్‌మెంట్ ఇచ్చి తర్వాత ఆరోగ్యకారణాల వల్ల రద్దు చేస్తున్నట్టు చెప్పారని ఆయన వెల్లడించారు. మరో రోజు తమకు సమయం కేటాయించాల్సిందని, కానీ అసలు అపాయింట్‌మెంట్ లేదనడం అప్రజాస్వామికమని జానారెడ్డి విమర్శించారు. న్యాయం జరిగేవరకూ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు.
చీకటి ఒప్పందం కాదా: ఉత్తమ్‌కుమార్ రెడ్డి
టిఆర్‌ఎస్ ప్రభుత్వం పై వచ్చిన ఆరోపణలపై విచారణకు బిజెపీ ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నిస్తూ ఇది చీకటి ఒప్పందం కాదా అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలదీశారు. పది నుంచి పదిహేను వేల కోట్ల రూపాయల కుంభకోణంపై విచారణ కు కేంద్రం ఎందుకు వెనుకాడుతోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నా«ద్ సింగ్ అపాయింట్‌మెంట్ ఇచ్చి రద్దు చేశారని, కనీస ఆయన వ్యక్తిగత కార్యదర్శికి కూడా వినతి పత్రం అందించడానికి అంగీకరించలేదన్నారు. తెలంగాణ లో అన్ని రాజకీయ పార్టీలు సీబీఐ విచారణ కు డిమాండ్ చేస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే సీబీఐ విచారణకు అంగీకరించాలని సీపీఐ నేత చాడ వెంకట రెడ్డి డిమాండ్ చేశారు.
టీకాంగ్రెస్ నేతలకు రాజ్‌నాథ్ ఝలక్
Published Wed, Jun 28 2017 11:00 PM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM
Advertisement
Advertisement