!['ఐటెం సాంగ్స్ వల్లే అత్యాచారాలు' - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/41402044076_625x300.jpg.webp?itok=oRjC58yI)
'ఐటెం సాంగ్స్ వల్లే అత్యాచారాలు'
పుణ్యధరిత్రిలో పడతులపై అత్యాచారాలకు అంతేలేకుండా పోతోంటే, పాశుపతాస్త్రం లాంటి కఠిన చట్టాలతో మానవ మృగాలకు కళ్లాలు వేయాల్సిన పాలకులు చేతులు ముడుచుకూర్చున్నారు. తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు వంకలు వెతుకుతూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. దేశంలో అతిపెద్ద రాష్ట్రంగా కొనసాగుతున్న ఉత్తరప్రదేశ్ లో ఆగకుండా జరుగుతున్న అత్యాచారాల పర్వంపై పాలకగణం చేస్తున్న వ్యాఖ్యలు వారి బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతున్నాయి.
యూపీ పాలకుడు అఖిలేష్ యాదవ్, ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్ ఇప్పటికే పలు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. వీరిని బీజేపీ నేత, మధ్యప్రదేశ్ హోం మంత్రి బాబూలాల్ గౌర్ వెనుకేసుకురావడం పాలకశ్రేణుల దిగజారుడుతనాన్ని కళ్లకుగడుతోంది. ఏ ప్రభుత్వమూ అత్యాచారాల్ని నిరోధించలేదని, ఆ ఘటన జరిగిన తరువాతే చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందంటూ యాదవ్ ద్వయాన్ని వెనుకేసుకొచ్చారు.
అక్కడితో ఆగకుండా.. రేప్ అనేది కొన్నిసార్లు ఒప్పవుంది, కొన్నిసార్లు తప్పువుతుదంటూ వివాదస్పద వాఖ్యలు చేశారు. అత్యాచారం అనేది ఒక సామాజిక నేరమని.. అది స్త్రీ, పురుషులపై ఆధారపడి ఉంటుందన్నారు. పురుషుడు మానసిక సమతుల్యం తప్పినప్పుడే అత్యారానికి పాల్పడతాడని విశ్లేషించారు. మహిళలు కరాటే, జూడో లాంటి స్వీయరక్షణ విద్యలు నేర్చుకోవాలని ఉచిత సలహాయిచ్చారు. సినిమాల్లోని ఐటం నెంబర్ పాటల వల్ల కూడా వతావరణం పాడవుతోందని తెగ బాధపడిపోయారు. సినిమాలు, టీవీల్లోని అంగాంగ ప్రదర్శనలు కూడా అత్యాచారాలకు కారణమవుతున్నాయన్నది మంత్రిగారి ఉవాచ. గౌర్ బాధ్యతారహిత వ్యాఖ్యలపై వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.