
గ్యాస్ క్షేత్రాలను వెనక్కితీసుకోవడంపై రిలయన్స్ అభ్యంతరం
న్యూఢిల్లీ: కేజీ-డీ6 బ్లాక్‌లో తమ కాంట్రాక్ట్ పరిధిలోఉన్న ఐదు గ్యాస్ క్షేత్రాలను ప్రభుత్వం వెనక్కిలాక్కుంటుండటంపై రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం కాంట్రాక్టు ఒప్పంద ఉల్లంఘనేనని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నెల 11న చమురు శాఖకు రాసిన లేఖలో ఆర్‌ఐఎల్ ప్రెసిడెంట్, సీఓఓ బి. గంగూలీ ఈ విషయాన్ని పేర్కొన్నారు. కేజీ-డీ6లో మొత్తం 7,645 చదరపు కిలోమీటర్ల ప్రాంతలో 6,199 చ. కిలోమీటర్లను వెనక్కితిరిగివ్వాల్సిందేనని చమురు శాఖ అక్టోబర్ 28న రిలయన్స్‌కు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
వాస్తవానికి ఆర్‌ఐఎల్ స్వచ్ఛందంగా తిరిగిస్తామని చెప్పిన 5,367 చ. కిలోమీటర్ల ప్రాంతంతో పోలిస్తే చమురు శాఖ ఆదేశాల్లో 15 శాతం అదనంగా ఉండటం గమనార్హం. ఈ అదనంగా తిరిగివ్వాలన్న ప్రాంతంలో డీ5, డీ7, డీ8, డీ16, డీ23 అనే అయిదు గ్యాస్ క్షేత్రాలు ఉన్నాయని, 0.805 ట్రిలియన్ ఘనపుటడుగుల గ్యాస్ నిల్వలు ఇందులో ఉన్నట్లు ఆర్‌ఐఎల్ చెబుతోంది. డీ1, డీ3 ప్రధాన క్షేత్రాల్లో నిల్వలతో పోలిస్తే నాలుగింట ఒకవంతుకు సమానమని, వీటి విలువ 10 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది