విలీన వార్తలను ఖండించిన యాక్సిస్ బ్యాంకు
ముంబై: దేశంలో మూడో అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థ యాక్సిస్ బ్యాంక్ ను, మరో ప్రయివేట్ రంగ సంస్థ కొటక్ మహీంద్రా బ్యాంక్ కొనుగోలు చేయనున్నట్టు వార్తలు మార్కెట్ లో హల్ చల్ చేశాయి. తర్వలోనే కొటక్ బ్యాంక్ చేతికిఽ యాక్సిస్ బ్యాంక్ వెళ్లిపోనుందని, ప్రయివేట్ రంగ దిగ్గజ బ్యాంకును కోటక్ స్వాధీనం చేసుకోనుందనే నివేదికలు అటు ఇన్వెస్టర్లు, ఇటు మార్కెట్ వర్గాల్లో ఆందోళన రేపాయి.
అయితే ఈ వార్తలను యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ శిఖా శర‍్మ తీవ్రంగా ఖండించారు. ఇవన్నీ అవాస్తవాలని, నిరాధారమైనవనీ కొట్టి పారేశారు. తాము బ్యాంకింగ్ సేవల్లో అతిపెద్ద కార్పొరేట్ సంస్థగా కొనసాగుతున్నామనీ, విలీనం అయ్యే సమస్యేలేదని స్పష్టం చేశారు. ఇలాంటి స్పెక్యులేషన్స్‌ని నమ్మవద్దని కోరారు.
కొటక్ మహీంద్రా మెర్జర్ ప్రణాళికల్లో ఉన్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకు కొటక్ యాజమాన్యం ఇప్పటికే ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాదు యాక్సిస్ టేకోవర్‌కు మరిన్ని దిగ్గజ బ్యాంకులు పావులు కదిపే అవకాశమున్నట్లు పుకార్లు చెలరేగాయి.
అసలే డిమానిటైజేషన్ ప్రక్రియలో ఉద్యోగుల అక్రమాలతో ఇబ్బందుల్లో పడ్డ యాక్సిస్ బ్యాంక్ ఈ విలీనం వార్తలతో మరింత చిక్కుల్లో పడ్డట్టయింది. దీంతో మార్కెట్‌లో సంచలనంగా మారింది. దీంతో యాక్సిస్ బ్యాంక్ షేరు దాదాపు 5.34 శాతం లాభపడగా కొటక్ బ్యాంక్ 0.4 శాతం నష్టపోయినా..చివరలో కోలుకుని 0.24 శాతం లాభాలతో ముగిసింది.