ప్చ్.. ధరల ఊరట కొంతే
న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం రేటు ఆగస్టులో స్వల్పంగా తగ్గింది. 9.52%గా నమోదయ్యింది. జూలైలో ఇది 9.64%. అయితే వార్షిక ప్రాతిపదికన కూరగాయల ధరలు సామాన్యునికి అందనంత ఎత్తులోనే ఉన్నాయి. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ గురువారం ఈ గణాంకాలను విడుదల చేసింది.
మూడు ప్రధాన విభాగాలు...
సూచీలోని మూడు వేర్వేరు విభాగాల్లో ఒకటైన ఆహారం, పానీయాల విభాగంలో ధరలు ఈ నెలలో వార్షిక ప్రాతిపదికన (2012 ఆగస్టులో పోల్చితే 2013 ఆగస్టులో) 11.06 శాతం పెరిగాయి.
ఇంధనం లైట్ విభాగంలో ధరలు 7.58 శాతం ఎగశాయి.
దుస్తులు, బెడ్డింగ్, పాదరక్షల విభాగంలో ధరలు 8.99% పెరిగాయి.
నిత్యావసర ధరలు ఇలా...: ఆహారం, పానీయాల విభాగంలో కూరగాయలు సహా పలు నిత్యావసర వస్తువుల ధరలు మండిపోయాయి. వార్షిక ప్రాతిపదికన ఈ ధరలు ఆగస్టులో 26.48 శాతం పెరిగాయి. ప్రొటీన్ ఆధారిత గుడ్లు, మాంసం, చేపల ధరలు 13.65 శాతం ఎగశాయి. తృణధాన్యాలు సంబంధిత ఉత్పత్తుల ధరలు 14.09 శాతం ఎగశాయి. పాలు, పాల ఉత్పత్తుల ధరలు 7.94 శాతం పెరిగాయి. ఆల్కహాలేతర పానీయాల ధరలు 10.13 శాతం ప్రియం అయ్యాయి. పండ్ల ధరలు 5.19 శాతం, పప్పు దినుసుల ధరలు 1.66 శాతం, వంటనూనెల ధరలు 1 శాతం పెరిగాయి. ఒక్క చక్కెర ధర మాత్రం 2.50 శాతం తగ్గింది.