ఉభయ సభల్లో హోరెత్తిన సమైక్య నినాదాలు
న్యూఢిల్లీ : పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభం అయిన కొద్దిసేపట్లోనే వాయిదా పడ్డాయి. బుధవారం ఉదయం ఉభయ సభలు ప్రారంభం కాగానే ఇటీవల మరణించిన పార్లమెంట్ మాజీ సభ్యులకు సంతాపం తెలిపాయి. అనంతరం సభ్యుల గందరగోళం మధ్య లోక్ సభ మొదలైంది. సీమాంధ్ర ప్రాంత సభ్యుల సమైక్య నినాదాలతో సభ దద్దరిల్లింది. ఈ నేపథ్యంలో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడటంతో స్పీకర్ మీరాకుమార్ సమావేశాలను మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేశారు.
మరోవైపు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సభ్యుల నినాదాలు, ఆందోళన మధ్య రాజ్యసభ కూడా వాయిదా మధ్యాహ్నం వరకూ వాయిదా పడింది. అంతకు ముందు సభ్యులు ఛైర్మన్ వెల్ లోనికి దూసుకు వచ్చి నినాదాలు చేయటంతో హమీద్ అన్సారీ వారించినా ఫలితం లేకపోయింది. దాంతో సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
కాగా నేటి నుంచి 21 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ నెల 12 రైల్వే బడ్జెట్, 17న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు అవినీతి నిరోధక బిల్లు, మహిళా రిజర్వేషన్, మతహింస సహా పలు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టాలని యూపీఏ సర్కారు భావిస్తోంది. అంతేకాకుండా కీలకమైన తెలంగాణ బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెడతామని ప్రధాని మన్మోహన్‌సింగ్ తెలిపారు.