‘సాక్షి’తో మాట్లాడుతున్న టీటీడీ ఈవో సాంబశివరావు
సాక్షి, తిరుమల: అఖిలాండ బ్రహ్మాండనాయకునికి ఈ ఏడాది నిర్వహించే రెండు బ్రహ్మోత్సవాలు అద్భుతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, వాటిల్లో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తామని టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు చెప్పారు. ఆర్జిత సేవలు రద్దు చేశామన్నారు. ప్రయాణం, బస, మూల విరాట్టు దర్శనం, ఉత్సవ మూర్తుల దర్శనం సాఫీగా జరిగేలా చర్యలు చేపట్టామని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో నిర్ణీత సమయానికే వాహన సేవలు నిర్వహిస్తామని, ఆ సేవల్లో శ్రీవారి వాహనాల అలంకరణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని వివరించారు.
అధిక మాసం సందర్భంగా సెప్టెంబరు 16 నుంచి 24 వరకు వార్షిక, అక్టోబరు 14 నుంచి 22వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుండటంతో ఆ ఏర్పాట్లను ఆయన ఆదివారం ‘సాక్షి’కి వివరించారు. ఆ వివరాలు..
అరగంట ముందే గరుడ వాహనం ఊరేగింపు
బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహనం ఊరేగింపు, చక్రస్నానం సమయంలో భక్తులు అశేష సంఖ్యలో తరలివస్తారు. గతంలో ఎదురైన అనుభవాలు సమీక్షించాం. లోటుపాట్లు పునరావృతం కాకుండా ఏర్పాట్లు చేశాం. ముందుగా నిర్ణయించిన ప్రకారం రాత్రి 8 గంటలకు గరుడ వాహనసేవ నిర్వహిస్తాం.
స్వామిని దర్శించేందుకు ఉదయం నుంచే సామాన్య భక్తులు లక్షలాదిగా వేచి ఉంటారు. అవసరాన్ని బట్టి వాహన సేవను అరగంట ముందే ఊరేగించాలని భావిస్తున్నాం. పురవీధుల్లో వాహన సేవ చాలా నిదానంగా సాగుతుంది. రద్దీ ఉండే ప్రాంతాల్లో అటు ఇటు తిప్పుతూ దర్శనం కల్పిస్తాం. పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. భక్తులందరూ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వీలుగా దశలవారీగా అనుమతిస్తాం.
భక్తి, ఆధ్యాత్మిక, కళారూపాల ప్రదర్శన
ఉత్సవాల తొమ్మిది రోజులు ఆలయ వీధుల్లో ఆధ్యాత్మిక, ధార్మిక, భక్తి, సాంస్కృతిక కార్యక్రమాలతో భక్తులను అలరిస్తాం. ప్రముఖులతో ధార్మిక ఉపన్యాస కార్యక్రమాలు రూపొందిం చాం. ప్రత్యేక కార్యాచరణతో ఉత్సవాల్లో శ్రీవారి ఆధ్యాత్మిక, తేజోవైభవాన్ని చాటుతాం. ఇక బ్రహ్మోత్సవాల విజయవంతం చేయడం లో టీటీడీ, పోలీసు, ఆర్టీసీ విభాగాలది కీలకపాత్ర. ఈ మూడు ఒకేమాటపై నడిచేలా సమన్వయపరుస్తాం. గరుడ వాహ నం రోజున ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలను నిషేధించాం. అవసరాన్ని బట్టి ట్రాఫిక్ నియంత్రణలో మార్పులు చేస్తాం.
ఏపీ సీఎం చేతుల మీదుగా వేయికాళ్ల మండపానికి పునాది
చారిత్రక నేపథ్యం కలిగిన వేయికాళ్ల మండపాన్ని వెయ్యేళ్లు నిలిచేలా నిర్మించాలని సంకల్పించాం. ఉత్సవాలకు అనువుగా ఆధ్యాత్మికత, ధార్మికత ఉట్టిపడేలా సాంకేతిక పరిజ్ఞానంతో ఆలయానికి నైరుతీ దిశలోని నారాయణగిరి ఉద్యాననవంలో నిర్మిస్తాం. బ్రహ్మోత్సవాల ఆరంభంలో సీఎం చేతుల మీదుగా పునాది వేయించాలని సంకల్పించాం.
ప్రత్యేక దర్శనాలు రద్దు
ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేశాం. కొన్ని సేవలను ఏకాంతంగా నిర్వహిస్తాం. ప్రొటోకాల్ మినహా వీఐపీ సిఫారసు దర్శనాలన్నీ రద్దు చేశాం. ఆలయంలో మూలమూర్తి దర్శనం, కైంకర్యాలు పోను మిగిలిన సమయాన్నంతా సామాన్య భక్తులకు కేటాయిస్తాం. నిత్యం ఆలయంలో మూడున్నర లక్షల లడ్డూలు తయారు చేస్తున్నాం. ఉత్సవ సమయంలో రోజూ ఆరు లక్షల లడ్డూలు సిద్ధంగా ఉంచుతాం. నాణ్యత, శుచి, శుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తాం. రోజూ లక్ష మందికిపైగా అన్నప్రసాదాలు పంపిణీ చేస్తాం.