ఆపిల్కు షాక్.. శాంసంగ్కు ఊరట
అమెరికన్ టెక్ దిగ్గజం ఆపిల్పై దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ పైచేయి సాధించింది. ఐకానిక్ ఐఫోన్ డిజైన్పై గత కొంతకాలంగా సాగుతున్న వివాదంలో శాంసంగ్కు అనుకూలంగా తీర్పువచ్చింది. శాంసంగ్కు విధించిన 400 మిలియన్ డాలర్ల(రూ.2698 కోట్ల) జరిమానాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో శాంసంగ్ ఊపిరిపీల్చుకుంది. తమ ఐకానిక్ ఐఫోన్ రూపురేఖల డిజైన్ పేటెంట్లను, కలర్ఫుల్ ఐకాన్లను శాంసంగ్ ఉల్లంఘించిందని ఆపిల్ చాలాకాలంగా వాదిస్తున్న సంగతి తెలిసిందే. పలుసార్లు శాంసంగ్కు వ్యతిరేకంగా తీర్పులు కూడా వచ్చాయి. ఈ తీర్పుల్లో శాంసంగ్ 400 మిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని ఆపిల్కు చెల్లించాలని కింది కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పుపై శాంసంగ్ సుప్రీంను ఆశ్రయించింది.
కాపీ చేసి ఐఫోన్ డిజైన్పై వచ్చిన లాభాలన్నింటిన్నీ ఆపిల్ తీసుకోవడానికి వీలులేదని సుప్రీంకోర్టు తాజాగా తీర్పుచెప్పింది. 400 మిలియన్ డాలర్లను బలవంతం మీద శాంసంగ్ నుంచి రాబట్టాలనుకుని కింద కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించలేదు. గత కొంతకాలంగా సాగుతున్న ఈ వివాదంలో మొదటిసారి శాంసంగ్కు వ్యతిరేకంగా వచ్చిన తీర్పులో ఆ కంపెనీకి దాదాపు 1 బిలియన్ డాలర్ల పెనాల్టీ పడింది. అనంతరం ఆ జరిమానా 548 మిలియన్ డాలర్లకు తగ్గింది. ప్రస్తుత వివాదంలో 400 మిలియన్ డాలర్లు చెల్లించాలని కింది కోర్టు ఆదేశించింది. అయితే ఆఖరికి ఈ జరిమానా విషయంలో సుప్రీంలో శాంసంగ్ పైచేయి సాధించింది.