వికార్ ఎన్‌కౌంటర్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు
సభ్యులుగా ఖమ్మం ఎస్పీ షానవాజ్, మరో నలుగురు
సమగ్ర దర్యాప్తు తర్వాత కోర్టుకు నివేదిక
ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాది వికారుద్దీన్ ముఠా ఎన్‌కౌంటర్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) రాష్ర్ట ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఐజీ(పర్సనల్) సందీప్ శాండిల్యను సిట్ చీఫ్‌గా నియమించింది. ఖమ్మం జిల్లా ఎస్పీ షానవాజ్ ఖాసిం, ఇంటెలిజెన్స్ విభాగం డీఎస్పీ ఎం.దయానంద్ రెడ్డి, ఏసీపీ ఎం.రమణకుమార్, ఇన్ స్పెక్టర్లు రాజా వెంకటరెడ్డి, ఎస్.రవీందర్ సిట్ సభ్యులుగా ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై సమగ్ర, నిష్పాక్షిక దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. వరంగల్ కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీలుగా ఉన్న వికారుద్దీన్, సయ్యద్ అంజద్, ఎండీ జాకీర్, ఎండీ హనీఫ్, ఇజార్‌ను ఈ నెల 7న కోర్టు విచారణ నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా నల్లగొండ జిల్లా ఆలేర్ సమీపంలో ఎన్‌కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే.
పోలీసుల ఆయుధాలు లాక్కుని కాల్పులు జరిపేందుకు వికార్ గ్యాంగ్ యత్నించడంతో ఎదురుకాల్పుల్లో నిందితులంతా చనిపోయినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌పై ఆలేర్ పోలీసుస్టేషన్‌లో క్రైం నెంబరు 35/2015 కింద ఐపీసీ, ఆయుధాల చట్టం, సీఆర్‌పీసీ సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విచారణ ఖైదీల మృతికి దారితీసిన పరిస్థితులను వెలుగులోకి తెచ్చేందుకు సిట్ ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు చేయిస్తున్నట్లు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. దర్యాప్తులో భాగంగా ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన అన్ని ఆధారాలు సేకరించాలని, లోపాలుంటే వెలికి తీయాలని సిట్‌ను ఆదేశించింది. దర్యాప్తు నివేదికను సంబంధిత న్యాయస్థానంలో సిట్ సమర్పిస్తుందని తెలిపారు.
సిట్ చీఫ్‌గా శాండిల్య
Published Tue, Apr 14 2015 1:51 AM | Last Updated on Sun, Sep 3 2017 12:15 AM
Advertisement
Advertisement